half day classes till 17th of this month: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరచుకోనున్న నేపథ్యంలో ఎండల దృష్ట్యా ఈ నెల 17వరకు ఒంటి పూట బడులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు పునఃప్రారంభమవుతోన్న దృష్ట్యా అన్ని పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్లు మెుదటి రోజే అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల 10 వేల 165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 1,042. 53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కనీసం ఒక వారం పాటు స్కూళ్లకు సెలవులు పొడగించాలని లేకేశ్ సీఎం జగన్కు సూచించారు. పిల్లలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
కిట్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం జగన్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ కిట్ల పంపిణీని లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందజేయనున్నారు. వీటితో పాటు 6 నుంచి పదో తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు -తెలుగు డిక్షనరీ, 1 నుంచి 5 వ తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్లు అందజేయనున్నారు.
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్: ప్రతి విద్యార్థికీ దాదాపు 2 వేల 400ల విలువైన జగనన్న విద్యా కానుక అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జగనన్న విద్యా కానుక ద్వారా పొందిన వస్తువుల్లో ఏమైనా ఇబ్బందులుంటే విద్యార్థులు తమ స్కూల్ హెడ్మాస్టర్లకు వాటిని అందిస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి చెప్పవచ్చని తెలిపింది.
స్కూల్స్ పునః ప్రారంభంపై నారా లోకేశ్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నప్పటికీ ఈ సమయంలో స్కూళ్లు తెరవడం అంటే విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెట్టడమే అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కనీసం ఒక వారం పాటు స్కూళ్లకు సెలవులు పొడిగించాలన్నది తల్లిదండ్రుల అభిప్రాయమని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్... ఈ విషయం లో సమాచారం తెప్పించుకుని తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.