Jagan Letter to Modi on Krishna Water Redistribution Decision: కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. దీల్లో పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కృష్ణా జలాలపై విధివిధానాలను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయడం భావ్యం కాదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకను మినహాయించి కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితమం చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లే వరకు మీనమేషాలు లెక్కిస్తూ ఊరుకున్న జగన్ ఇప్పుడు కృష్ణా జలాలపై విధివిధానాలను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయొద్దంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Central Government Decision on Redistribution of Krishna Waters: బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్‌ఎల్‌పీలు దాఖలయ్యాయని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ నివేదకలు పక్కనపెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును అభ్యర్థించిందని 2011 సెప్టెంబర్ 16న బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌పై సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అన్ని S.L.Pలు సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సమస్య గురించి 2021 ఆగస్టు 17న, 2022 జూన్ 25న కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చామని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
People who Depend on Krishna Water: ట్రైబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు భంగం కలగకుండా చట్టపరంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ విధివిధానాలను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారని ఈ నిర్ణయం కృష్ణా జలాలపైనే ఆధారపడి జీవిస్తున్న ఏపీ ప్రజల ప్రయోజనాలకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని సీఎం జగన్ లేఖలో ప్రధాని మోదీకి తెలిపారు.
Krishna Waters are Limited to Telugu States: రెండు రాష్ట్రాలకే పరిమితం చేసి మహారాష్ట్ర, కర్ణాటకలను మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని ధృడంగా విశ్వసిస్తున్నామన్నారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా సబంధిత వ్యక్తులను ఆదేశించాలంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం నిలుపుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.