MBBS students fired on AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చైనా, ఫిలిప్పీన్స్, కజికిస్థాన్ వంటి విదేశాలకి వెళ్లి ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన 2016-21 బ్యాచ్ విద్యార్థిని, విద్యార్థులు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు తమకు న్యాయం చేయటం లేదంటూ వాపోతున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్లో చదివి.. వ్యక్తిగతంగా పాల్గొంటేనే గుర్తింపు ఇస్తామన్న అధికారులు.. మాటమార్చి మరో ఏడాది ఇంటర్న్‌షిప్ చేస్తేనే శాశ్వత రిజిస్ట్రేషన్ ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాలు తమ బ్యాచ్ సభ్యులకు న్యాయం చేస్తుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం తమకు అన్యాయం చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని కన్నీరుమున్నీరవుతున్నారు.
మాటమార్చిన అధికారులు-అయోమయంలో విద్యార్థులు.. విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ శైలితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సమయంలో ఆన్‌లైన్లో చదివినా, వ్యక్తిగతంగా పాల్గొంటేనే గుర్తింపు ఇస్తామని.. మరో ఏడాది ఇంటర్న్‌షిప్ చేస్తేనే శాశ్వత రిజిస్ట్రేషన్ ఇస్తామని అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. గోడు తెలిపేందుకు మెడికల్ కౌన్సిల్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. కనీసం విద్యార్థుల వైపు కన్నెత్తి చూడని వైనం కనిపిస్తోంది.
కోర్సు పూర్తి చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాం.. విదేశాల్లో వైద్య విద్య చదివిన 2016-21 బ్యాచ్ విద్యార్థులకు.. ఆంధ్రప్రదేశ్ భారతీయ వైద్య మండలి మొండి చేయి చూపిస్తోంది. చైనా, ఫిలిప్పీన్స్, కజికిస్థాన్‌లో ఎంబీబీఎస్ అభ్యసించిన వారికి కొవిడ్ సమయంలో 'వందేభారత్' మిషన్‌తో వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో విద్య అభ్యసించవచ్చని చెప్పారు. దీంతో చాలా మంది విదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చి ఆన్‌లైన్లో తరగతులకు హాజరయ్యారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత.. ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు.
చాలా రాష్ట్రాలు గుర్తింపునిచ్చాయి.. అనంతరం ఆన్‌లైన్ కోర్సు చేసిన సమయాన్ని నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సులో అనుమతించాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (N.M.C.) ఆదేశించింది. ఈ మేరకు చాలా రాష్ట్రాలు అనుమతిస్తూ.. వారికి గుర్తింపు ఇచ్చాయి. ఆయా వైద్య మండళ్లు వారిని వైద్యులుగా గుర్తించాయి. కానీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ మాత్రం.. వ్యక్తిగతంగా హాజరైతేనే ఆన్‌లైన్ సమయాన్ని గుర్తిస్తామని తేల్చి చెప్పింది. దీనిపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.
పీజీ విద్యకు దూరమవుతున్నాం.. వంద మందికి పైగా విద్యార్థులు 3 నెలలుగా విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గోడు పట్టించుకోకపోవడంతో.. గురువారం ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆవరణలోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మిగిలిన రాష్ట్రాలు గుర్తింపు ఇస్తున్నా.. ఇక్కడెందుకు అభ్యంతరాలు చెబుతున్నారని విద్యార్థులు నిలదీశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని నీట్ పీజీ రాయాలనుకుంటున్నా.. అధికారులు గుర్తింపు ఇవ్వకపోడంతో పీజీ విద్యకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి.. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం.. మరోవైపు విద్యార్థుల దరఖాస్తులు పరిశీలిస్తున్నామని.. N.M.C లేఖ రాశామని.. ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ తెలిపారు. కొన్నింటిపై అభిప్రాయాలు వచ్చాయని.. వాటిని ఆయా విశ్వవిద్యాలయాలకు పంపుతున్నామన్నారు. సజావుగా ఉన్న వాటికి గుర్తింపు ఇస్తున్నామని.. ప్రభుత్వంతోనూ సంప్రదిస్తున్నామన్నారు.