Old Pension Scheme: అధికారంలోకి వచ్చిన వారం లో సీపీఎస్ రద్దు చేస్తానని పాదయాత్రలో ముద్దులు పెడుతూ మాటిచ్చిన వైఎస్ జగన్ మాట తప్పారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. జగన్ మాటలు నమ్మి ఓట్లేస్తే చివరకు చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. అవగాహన లేకుండా సీపీఎస్‌పై హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని, అలా అనడానికి...సజ్జల ఎవరని ప్రశ్నించారు. సీపీఎస్ పై హామీ వెనక్కి తీసుకుంటే ఆ మాట సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వంపైన రూపాయి కూడా భారం పడదని, రాష్ట్ర ప్రభుత్వానికే మరింత ఆదాయం వస్తుందన్నారు.
విజయవాడ విద్యాధర పురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓపీఎస్ సాధన సమితి ఆవిర్భావ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కారరావు హాజరయ్యారు. ఓపీఎస్ సాధన సమితి లోగో ను కరపత్రాలను విడుదల చేశారు. 26 జిల్లాలఓపీఎస్ సాధన సమితి నాయకులు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు కోసం చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ, చట్టబద్దత అంశాలపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. సీపీఎస్ కోసం ఎపీలో ఎక్కడా చట్టం చేయలేదని, 2004 సెప్టంబర్ లో జీవో 653 ను తీసుకువచ్చి అమలు చేశారన్నారు. ఈ జీవోకు రాజ్యాంగ బద్దత లేదని దీనిపై న్యాయస్థానాల్లో సవాల్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చేందుకు చట్టం చేయలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయకుండా వ్యక్తిగత గుర్తింపు కోసం ఎపీఎన్జీవో సహ పలు ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి సంఘాలను మళ్లీ నమ్మి మోసపోవద్దని కోరారు. నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మెకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ బిక్ష కాదు..హక్కు అని ప్రభుత్వ ఉద్యోగులసంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార రావు అన్నారు. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని న్యాయ స్థానాలూ చెప్పాయన్నారు. ఇప్పుడు పెన్షన్ కోసం బిక్షమెత్తుకుంటున్నామన్నారు. హక్కుగా ఉన్న పెన్షన్ కోసం బిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఒల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించి తీరతామన్నారు. రేపట్నుంచి అక్టోబర్ 31 వరకు 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని, రేపటి నుంచి జరిగే ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొనాలని ఆస్కార రావు పిలుపునిచ్చారు.
'నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మెకు తాము సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ బిక్ష కాదు..హక్కు పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని న్యాయ స్థానాలూ వెల్లడించాయి. ఆయినా పెన్షన్ కోసం బిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చింది. హక్కుగా ఉన్న పెన్షన్ కోసం బిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి రాకూడదనే పోరాటం చేస్తున్నాం. ఒల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించి తీరతాం.'- ఆస్కారరావు,ఎపీజీఈఎ ప్రధానకార్యదర్శి
ఇవీ చదవండి: