medicines for government hospitals in ap : పొటెన్సీ-బీపీ 100జీ అనే 'ఐరన్ సుక్రోజ్' ఇంజెక్షన్‌ను ఏపీఎంఎస్ఐడీసీ సంస్థ తయారీదారుల నుంచి నేరుగా 15రూపాయల 25పైసల చొప్పున కొనుగోలు చేసింది. ఇదే ఇంజెక్షన్‌ను వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఎంపిక చేసిన పంపిణీదారుడు మాత్రం 193 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో 50రూపాయలకే లభించే పైపరిల్లింగ్, తాజోబ్యాక్టీం-4.5 ఎంజీ మందును ఏపీఎంఎస్ఐడీసీ 73 రూపాయల చొప్పున తయారీ సంస్థల నుంచి నేరుగా తీసుకుంటోంది. అదే మందును వైద్యారోగ్య శాఖ 315 రూపాయలకు కొనుగోలు చేస్తోంది. ఏకంగా 530 శాతం అధికంగా చెల్లిస్తోంది. రాష్ట్రంలో ఆసుపత్రులకు సరఫరా చేసే మందుల ధరల్లో గోల్‌మాల్‌ను ఇవి రుజువు చేస్తున్నాయి.
బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు జనరిక్ ఔషధాలు లభిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయా మందులను ఆసుపత్రులకు అధిక ధరలతో కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. మార్కెట్లో లభించే ధరతో పోలిస్తే 500శాతం పైగానే అధికంగా చెల్లిస్తూ పంపిణీదారుడికి కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెడుతోంది. అదేమంటే బ్రాండెడ్ ఔషధాలు సరఫరా చేస్తున్నామంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు పెద్దఎత్తున దోచి పెడుతున్న విషయం స్పష్టమవుతున్నా.. ఎమ్మార్పీ కంటే బాగా తక్కువేనని సమర్ధించుకుంటోంది. వాస్తవానికి మందుల సరఫరాకు సంబంధించి టెండరు ఎంపికలోనే పెద్ద తతంగం నడిచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల సరఫరాకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్ ద్వారా 100 కోట్ల రూపాయల వరకు విక్రయాలు జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు అవసరమైన మందులను రెండు విధాలుగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన మొత్తంలో 80శాతం నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా కొంటున్నారు. ఈ సంస్థ తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ఆసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మిగిలిన 20 శాతం నిధులతో అత్యవసర మందుల్ని కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా కొంటున్నారు. ఇది లోపభూయిష్టంగా ఉందంటూ ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలోనే టెండరు పిలిచి పంపిణీదారుడిని ఎంపిక చేశారు. టెండరు దరఖాస్తులో అర్హతల కింద జనరిక్ మందులు మాత్రమే పంపిణీ చేయాలి. ఇవి అందుబాటులో లేనప్పుడు మాత్రమే బ్రాండెడ్, పేటెంట్ మందుల పంపిణీకి అనుమతిస్తామని నిబంధనల్లో స్పష్టం చేసింది. టెండరులో ఎల్1గా నిలిచిన సంస్థ హోల్సేల్ మార్కెట్ ధరలో 35.6శాతం రాయితీతో ఇస్తామని కోట్ చేసింది. అధికారులు ఆ టెండరును ఖరారు చేశారు.
దానికనుగుణంగా ఆగస్టు నుంచి మందుల పంపిణీ ప్రారంభించారు. జనరిక్ మందుల సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. మార్కెట్లో జనరిక్ మందుల్ని ఎమ్మార్పీ ధర పై 70శాతం నుంచి 85శాతం వరకు తగ్గించి ఇస్తున్నాయి. అంటే ఎమ్మార్పీ 100 రూపాయలు ఉంటే 15 నుంచి 30 రూపాయల ధరకే వస్తోంది. ఎల్1గా నిలిచిన సంస్థ ఎమ్మార్పీపై 35.6 శాతం చొప్పున తగ్గిస్తామని మాత్రమే వెల్లడించింది. అంటే ధర ఎక్కువగా ఉంటుందని తెలిసినా టెండరు కట్టబెట్టారు. టెండరు ఆహ్వానించే సమయంలో టర్నోవర్‌గా 10 కోట్లు రూపాయలు నిర్ణయించడం ద్వారా గుత్తేదారుల నుంచి పోటీ తక్కువగా ఉండేలా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. జిల్లాలు, ప్రాంతీయ స్థాయిలో కొనుగోలుకు అవకాశం ఇవ్వకుండా.. గుత్తాధిపత్యం ఒకరికే అప్పగించడం కూడా వివాదాస్పదంగా తయారైంది. ఈ వ్యవహారంపై విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.
టెండరు దక్కించుకున్న పంపిణీదారు సరఫరా చేసే మందుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్థానికంగా కొనుగోలు చేసే సమయంలో.. తయారీదారుల నుంచి తాము కొనుగోలు చేసిన మందుల ధరలపై 40శాతం మించకుండా చూసుకోవాలని గతంలో ఏపీఎంఎస్ఐడీసీ స్పష్టం చేసింది. దీని ప్రకారం చూసినా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ధర 15రూపాయల 25 పైసలు. దాన్ని ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేస్తే 21 రూపాయల 35పైసలు ఉండాలి. ఇప్పుడు ఏకంగా 193 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. అధికశాతం మందుల ధరలపై నియంత్రణ లేకపోవడం కూడా ఇష్టారాజ్యంగా పెంచడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
ఎల్1 సంస్థ బ్రాండెడ్ మందులను ఎక్కువగా పంపిణీ చేస్తున్నట్లు ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డెరెక్టర్ చెబుతున్నారు. ఈ సంస్థ పంపిణీ చేసే ఙౌషదాల నాణ్యత గుర్తించేందుకు ప్రత్యేక యాప్ రూపొందిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: