Amaravati Capital Farmers: అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులపై ఇప్పటికే అభ్యంతరాలు తెలిపి.. గ్రామ సభల్లోనూ వ్యతిరేకంగా తీర్మానాలు చేసినా, నోటీసులిచ్చి విచారణకు రమ్మనడమేంటని రాజధాని రైతులు సీఆర్డీఏ అధికారులపై మండిపడ్డారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై ఎలా ముందుకు వెళ్తారని అధికారులను నిలదీశారు. ఏ ఉద్దేశంతో గెజిట్ విడుదల చేస్తారని మండిపడ్డారు. రాజధానిలో కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద నివాస స్థలాల కేటాయింపు ఉత్తర్వులపై సీఆర్డీఏ అభ్యంతరాలు కోరింది. 5,741 మంది రైతులు ఈ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పత్రాలు సమర్పించారు.
అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేకంగా ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు రైతుల నుంచి అభిప్రాయాలను తీసుకుని నమోదు చేస్తాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం, సీఆర్డీఏ కార్యాలయాలకు రాజధాని ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇచ్చారు. 19 గ్రామాల్లో నిర్వహించిన సభల్లో చేసిన తీర్మానాల కాపీలను అధికారులకు అందజేశారు. తుళ్లూరులో ప్రాంతీయ కార్యాలయం ఉన్నప్పటికి.. అక్కడ అభిప్రాయ సేకరణ చేయకుండా విజయవాడ వరకు రైతులను రప్పించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఇవీ చదవండి: