KVP Ramachandra Rao Comments: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అయితే ఆయన ఆత్మ శాంతిస్తుందని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. విజయవాడలోని జింఖాన గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, ఇతర నేతలతో కలిసి కేవీపీ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడితే ఏపీలోని పార్టీలు కనీసం ఖండించలేదన్న రామచంద్రరావు.. దీనికి ఓ ఆంధ్రుడిగా తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, వైసీపీ అంతా కూడా బీజేపీ అడుగులకు మడుగులొత్తుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు చెప్పలేకపోయామని అందుకే ప్రజలు పార్టీకి దూరంగా జరిగారని చెప్పారు. గాంధీభవన్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి ప్రసంగంలో ఏపీలో 41 మంది ఎంపీలను గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కార్యకర్తలకు చెప్పారని గుర్తు చేశారు. రాహుల్ ప్రధాని అయితేనే వైఎస్ ఆత్మ శాంతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రేణులంతా కలసిరావాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం మాత్రమే పని చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని అన్యాయంగా ఇళ్లు ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ కృషి చేసిందని, బీజేపీకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీకు గుణపాఠం చెప్పాలన్నారు. కర్నాటక ఎన్నికల నుంచే బీజేపీ పతనం ప్రారంభమం అవుతుందని చెప్పారు.
"వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. ఆయన చివరి ప్రసంగంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో చెప్పిన మాట ఏమిటంటే.. మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆంధ్రప్రదేశ్‌లో 41 పార్లమెంటు సీట్లను గెలిపించుకోవాలి అన్నారు. ఇది మన ధ్యేయం.. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అని ఆయన మనకి ఒక కర్తవ్యాన్ని నిర్దేశించివెళ్లారు. ఆయన కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి అయితే.. ఆయన ఆత్మ శాంతిస్తుందని ఎంత మంది నమ్ముతారో, నమ్మరో నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతాం". - కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇవీ చదవండి: