CM Jagan Attends Maha Yagnam at Vijayawada: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా యజ్ఞంలో పాల్గొని.. సంకల్ప దీక్ష తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కపిల గోవుకు హారతి ఇచ్చి, అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందటం కోసం, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం, లోక కల్యాణార్థం మహా యజ్ఞం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞాన్ని వేద మంత్రోచ్ఛరణలతో రుత్వికులు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 17 వరకు 6 రోజుల పాటు మహా యజ్ఞం కొనసాగనుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యాల కోసం మహా యజ్ఞం చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవదాయ, ధర్మధాయ శాఖ నిర్వహణలో కొనసాగనున్న మహా యజ్ఞంలో వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, ఆగమ నియమాలతో యజ్ఞం చేయనున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం 6 రోజుల పాటు యజ్ఞధారణను దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌధని కుమారి దంపతులు స్వీకరించారు.
యజ్ఞం ఎలా జగనుందంటే?: సనాతన ధర్మ పరిరక్షణ పేరిట నిర్వహిస్తోన్న ఈ యజ్ఞానికి వివిధ ప్రాంతాల వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిలు రానున్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనే నాలుగు వేదాలతో.. యజ్ఞాలు, హోమాలు, వీరశైవం, తంత్రసారం, గ్రామ దేవత ఆరాధన, చాత్తాద శ్రీవైష్ణవం అనే నాలుగు ఆగమంల ప్రకారంగా జప పారాయణలు జరగనున్నాయి.
మహాలక్ష్మీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, సప్తనదులు, త్రి సముద్ర జలాలు, 1008 కలశాలతో విశేష అభిషేకాలు చేస్తారు. సిద్దేశ్వరీ పీఠం, తిరుపతి శక్తి పీఠం, శ్రీశైలం సూర్య సింహాసన పీఠం, మంత్రాలయం రాఘవేంద్ర మఠం, పుష్పగిరి మహా సంస్థాన పీఠం, తిరుమల, తిరుపతి దేవస్థానం, మైసూరు దత్త పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేయునున్నారు. ప్రతి రోజూ సాయంత్రం ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈనెల 17న మహా పూర్ణాహుతి కార్యక్రమంతో యజ్ఞం ముగియనుంది.
ఇవీ చదవండి: