CM Jagan Cheating Anganwadi Workers : రాష్ట్రంలో ఉన్న వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలది ఇదే దుస్థితి. వేతనాలు పెరగక సంక్షేమ పథకాలు దూరమై నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మహిళలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నట్టు మాట కంటే ముందు అక్కచెల్లెమ్మలనే ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం వీరి వేదన కనిపించడం లేదు. మూడేళ్లుగా సమస్యలు పరిష్కరించాలని వినతులిస్తున్నా 11 రోజులుగా రోడ్డెక్కి పట్టించుకోండి మహాప్రభో అని వేడుకుంటున్నా కనీసం కనికరం చూపించడం లేదు.
Anganwadi Workers Problems : ఎప్పుడో నాలుగేళ్ల క్రితం వెయ్యి రూపాయలు పెంచేశాం, వారి జీవితాలన్నీ బాగుచేసేశాం అనేలా వ్యవహరిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయి? పిల్లలు చదువులు ఎలా ముందుకు సాగుతాయి? వారి కుటుంబ పోషణ పరిస్థితి ఏంటనే ఆలోచించే తీరికే లేనట్టుంది. పైగా వెంటవెంటనే బిల్లులు చెల్లించకుండా కేంద్రాల నిర్వహణ భారాన్నీ వారిపైనే మోపుతున్నారు. ఈ కష్టాలు భరించలేక రోడ్డెక్కి జోలె పడుతుంటే మహిళలనీ చూడకుండా వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతున్నారు.
ఆగని అంగన్వాడీల ఆర్తనాదాలు - హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరికలు
Anganwadi Staff Protest For To Resolve Issues : అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బిల్లులు సక్రమంగా చెల్లించరు. కూరగాయల బిల్లులు ఎప్పటికప్పుడు ఇవ్వరు. గ్యాస్ బండకిచ్చేదీ తక్కువే. చిన్నారులకు వడ్డించి పెట్టే మెనూ ఛార్జీలు చాలీచాలనంతే. ఇచ్చే అరకొర జీతమూ ఎప్పుడూ ఒక నెల పెండింగే ఇది రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ తీరు. అద్దె మొదలు మెనూ ఛార్జీల వరకు అన్నింటిపైనా ఎంతో కొంత ప్రతి నెలా అంగన్‌వాడీ కార్యకర్తలు చేతి నుంచే పెట్టుకుంటున్నారు. పట్టణాల్లో కొన్ని చోట్ల కేంద్రాల అద్దె 6000 రూపాయల వరకు ఉంది. వీటన్నింటిపైనా సరాసరిన 7,500 వరకు ముందుగానే అంగన్‌వాడీ కార్యకర్తలు పెట్టుబడి పెట్టాల్సిందే. ప్రతి నెలా ఇదే పరిస్థితి. వారికి గౌరవ వేతనంగా అందే 11,500 రూపాయలలోనే ఇదంతా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వమిచ్చినప్పుడు తీసుకోవాలి. ఇందులోనూ అద్దె మినహా మిగతా వాటన్నింటిలోనూ అంగన్‌వాడీలు వెచ్చించిన దానికంటే ప్రభుత్వమిచ్చేది తక్కువే. ఎందుకంటే నిబంధనలు అలా పెట్టారు మరి.
Anganwadi Workers Problems Increase in YSRCP Government : మెనూ ఛార్జీల కింద ప్రభుత్వం ఒక్కో చిన్నారికి రోజుకు రూపాయిన్నర ఇస్తోంది. కూరకు రూపాయి 25 పైసలు, తాలింపు గింజలకు 25 పైసలు చెల్లిస్తోంది. అదనంగా పడే మొత్తాన్ని అంగన్వాడీలే చేతి నుంచే పెట్టుకుంటున్నారు. నూనె ఒక్కొక్కరికి 5 గ్రాముల చొప్పున ఇస్తున్నారు. 10 మంది పిల్లలుంటే 50 గ్రాములొస్తుంది. దీంతో పులిహోర కలపాలా లేక పప్పు తాలింపు వేయాలా! ఆ మాత్రం ప్రభుత్వానికి తెలియదా? కందిపప్పు ఒక్కో చిన్నారికి 15 గ్రాములిస్తారు. అది ఎటూ చాలడం లేదని, అన్నీ లెక్కలేసుకుని వంట చేయాల్సిన పరిస్థితి ఉందని అంగన్‌వాడీలు వాపోతున్నారు. 20 మంది పిల్లలుండే అంగన్‌వాడీ కేంద్రానికి నెలకు సరాసరిన 300 రూపాయలు తమ చేతి నుంచే పెట్టుకుంటున్నామని చెబుతున్నారు. కూరగాయల ధరలు పెరిగినప్పుడు మరింత ఎక్కువ పడుతుందని పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదోరోజు అంగన్వాడీల నిరసన-"జగనన్నా మొండి వైఖరిని వదిలి సమస్యలు పరిష్కరించండి"
Anganwadies Agitation : గ్యాస్ వినియోగానికిగాను ప్రభుత్వం ఒక్కో చిన్నారికి 50 పైసలు ఇస్తోంది. గుడ్డు ఉడకబెట్టాలి. పాలు వేడి చేయాలి. అన్నం, రెండు రకాల కూరలు వండాలి. సరాసరిన ఒక గ్యాస్ బండ రెండు నెలలు వస్తుందని అంగన్‌వాడీలు చెబుతున్నారు. అంటే ప్రభుత్వమిచ్చేది 600 రూపాయలు. కానీ డెలివరీ ఛార్జీలతో కలిపి అంగన్‌వాడీలు 1200 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వారి చేతి నుంచి మరో 600 వరకు పెట్టాల్సి వస్తోంది. ఇది అదనపు భారం. గ్యాస్ బండ బిల్లుల్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నా.. వారి లెక్కల ప్రకారమే చెల్లిస్తున్నారు. పోనీ ఆ డబ్బులైనా ఎప్పటికప్పుడు చెల్లిస్తుందా అంటే 3-4 నెలలు పెండింగే. ఇప్పుడు అంగన్‌వాడీ సిబ్బంది రోడ్డెక్కడంతో అన్ని బిల్లులనూ చెల్లిస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం 10,500 రూపాయలుగా ఉంది. తర్వాత వారి వేతనాన్ని వెయ్యి పెంచారు. అంటే మొత్తంగా ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ పెంచింది వెయ్యి రూపాయలే. అది పెంచి అంతటితో ఆగలేదు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడంలో ఆరితేరిన జగన్ నిబంధనలను తెర మీదకు తెచ్చి వారికందే సంక్షేమ పథకాల్ని నిలిపేశారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంటు, చేయూత, ఇతర పథకాలేవీ వర్తించవంటూ ఏకంగా జీవోనే జారీ చేయించారు. చివరికి వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులుగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలకు అందే సామాజిక భద్రత పింఛన్‌ను కూడా నిలిపేశారు.
ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచిన కారణంగా ఏడాదికి వారికి అందే అదనపు లబ్ధి 12000 రూపాయలు. కానీ ఆ కార్యకర్త దివ్యాంగురాలైతే ఆమె కోల్పోయే పింఛను నెలకు 3000 చొప్పున ఏటా 36000 రూపాయలు. అంటే 12000 ఇచ్చి 36000 లాగేసుకున్నారు. ఇవీ జగన్ తెలివితేటలు. ఇక విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు వర్తించకుండా చేసి వారి పిల్లల భవిష్యత్తునే ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇది జగన్ మామయ్య అసలు సిసలు నైజం. దాదాపుగా 51 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు పథకాలు దక్కకుండా చేశారు. 2019తో పోలిస్తే కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. పిల్లల స్కూలు, కళాశాలల ఫీజులు భారీగా పెరిగాయి. ఎలాంటి ఆదరువు లేని అంగన్‌వాడీ మహిళలు సంక్షేమ పథకాలు అందకుండా 11 వేల 500 రూపాయలతో ఎలా బతుకుతారనే ఆలోచన కూడా లేదు.
తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చే నాటికి అంగన్‌వాడీ కార్యకర్తలకు 4 వేల 200 రూపాయల గౌరవవేతనం ఉండేది. 2016లో చంద్రబాబు దానిని 7 వేలకు పెంచారు. ఆ తర్వాత వారి విజ్ఞప్తి మేరకు 2018లో మరోసారి పెంచి 10 వేల 500 చేశారు. అంటే 2014-19 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో ఒక్కో అంగన్‌వాడీ కార్యకర్త వేతనాన్ని 6 వేల 300 రూపాయల చొప్పున పెంచారు. దీంతో అప్పట్లో సంక్షేమ పథకాల అర్హత నిబంధనను అంగన్‌వాడీ కార్యకర్తలు దాటిపోయారు. కానీ వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ని పథకాలనూ కొనసాగించారు. తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాన్ని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 2019లో వెయ్యి రూపాయలు పెంచి వారికి అందే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా తర్వాత తెలంగాణలో అక్కడి ప్రభుత్వం 2021లో అంగన్‌వాడీల వేతనాన్ని 10 వేల 500 నుంచి 13 వేల 500 చేసింది. రోడ్డెక్కి పోరాడుతున్నా ఇక్కడ జగన్ మాత్రం కిమ్మనడంలేదు.
కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలు