Chalo Assembly On March 20 : జీవో నెంబర్ 1 రద్దు చేయాలనే డిమాండ్ తో ఈ నెల 20 వ తేదీన అన్ని ప్రజా సంఘాలతో కలిసి 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం చేపడతున్నామని జీవో నెంబర్ 1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూ ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవచ్చునని, కానీ ఆ హక్కుకు తూట్లు పొడిచేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.
'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం : ఎవరైనా సభలు పెడితే 14 రకాల నిబంధనలతో అవి జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా చట్ట ప్రకారం అనుమతి ఇచ్చిందని విషయాన్ని గుర్తు చేశారు. నేడు పోలీసులే ఫిర్యాదు దారులుగా మారి హక్కులను కాల రాస్తున్నారని, పోలీసు వ్యవస్థను సొంత జాగీరుగా జగన్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఊరేగింపు పెడితే ట్రాఫిక్ కు అడ్డంకి అని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని, మరి జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, మాయలు ప్రజలకు చెప్పే బాధ్యత విపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. పోలీసులే రాస్తా రోకో చేసిన చరిత్ర ఒక్క ఏపీలోనే చూసి ఉంటామని అన్నారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు చేపడతామన్నారు.
" రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ అనే పేరుతో అప్రజస్వామిక రాజ్యాంగ విరుద్ధమైనా భావ వ్యక్తికరణ స్వేచ్ఛను హరించే విధంగా జీవోని పోలీసు చట్టాన్ని పరిగణలోకి తీసుకోని తీసుకోచ్చామని చెప్తా ఉన్నారు. ఒక వైపున నేషనల్ పోలీసు కమీషన్ చాలా స్పష్టంగా చెపుతా ఉంది ఈ పోలీసు చట్టానికి కాలం చెల్లిపోయిందని. ఇది మన మారిన పరిస్థితులకు పనికి రాదు అని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టే మీటింగ్ అయితే చాలా స్పష్టంగా దాన్ని ఎలా నిరోదించాలో ఈ చట్టం ప్రకారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక సంఘాలు, విద్యార్థి మేధావి సంఘాలు, అలానే ఉద్యోగ సంఘాలు కలిసి ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మార్చి 20 వ తేదిన నిర్వహించాలని తలపెట్టాము. దీన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. " - ముప్పాళ్ల సుబ్బారావు, జీవో నెంబర్ 1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్
ఇవీ చదవండి