BJP state president Somu Veerraju: వైసీపీతో తమ పార్టీ ఎప్పుడు కలిసి ఉందనేది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తమ పార్టీ తొలి నుంచి స్పష్టమైన వైఖరితోనే ఉందన్నారు. తమ పార్టీ అగ్రనేతల ప్రసంగాల్లో వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడిన అంశాల్లో కొత్తవి ఏమీ లేవని... అనేక అంశాలపై తాము వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న వాటిని.. వాస్తవ పరిస్థితులనే వెల్లడించారని సోము చెప్పారు. తమ పార్టీ జాతీయ, రాష్ట్ర శాఖలు జగన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని.. ఇందులో రెండో ఆలోచనకు తావులేదని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా తాము విభేదించే రాజకీయ పక్షం వైసీపీ అంటూ.. ఆ పార్టీది మతతత్వ వైఖరిగా వీర్రాజు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించకుండా చూడాలనేదే జగన్ ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తుందని సోము వీర్రాజు వెల్లడించారు. తమ పార్టీ రాష్ట్ర నాయకులు చేసిన విమర్శలకు బదులివ్వకుండా.. జాతీయ నాయకులు తమ పర్యటన సమయంలో చేసిన ప్రసంగాలపై స్పందిస్తూ... వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి మైండ్‌గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. నిధులు కోసం దిల్లీ వెళ్తారని.. రాష్ట్ర ప్రజల కోసం తాము నిధులు ఇస్తుంటే.. వాటికి తమ స్టిక్కర్లు అతికించుకుని ప్రచారం చేసుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీని.. ప్రధాని మోదీని పలచన చేయాలనే ధోరణితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
'అవినీతిపై విమర్శలు చేసినప్పుడు వైసీపీ నేతలకు ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ తదితర అంశాలు గుర్తుకొస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తోంది. కేంద్రం ఇచ్చిన డబ్బుతో మజా చేయాలి, ఖుషీ చేయాలనేది వైసీపీ వైఖరిగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు నిధుల ఇస్తున్నాం. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పథకాల కోసం వేల కోట్ల రూపాయలు అందజేసి అభివృద్ధి, సంక్షేమానికి సహకరిస్తున్నాం. అయినప్పటికీ వైసీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది.'- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
కేంద్రాన్ని కాదని రాష్ట్రంలో ఒక అంగుళం కూడా అభివృద్ధి అసాధ్యమని సోము వీర్రాజు వెల్లడించారు. తాము ప్రజాసంక్షేమానికే నిధులు ఇస్తున్నామే తప్ప జగన్ జేబుల్లోకి కాదని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి తాము ఏం చేశామనేది ప్రజల్లోకి వివరించేందుకు ఈనెల 20 నుంచి ఇంటింటి ప్రచారం చేస్తామని వీర్రాజు పేర్కొన్నారు. అందుకోసం లబ్ధిదారులతో ముఖాముఖిగా భేటీ అవుతామన్నారు. అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలోనూ ప్రత్యేక కిట్‌లను అందజేసి ఈ ప్రచార యాత్ర సాగిస్తామని వెల్లడించారు.
దుష్యంత్ కుమార్ గౌతమ్: రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, దోచుకోవటమే వైకాపా విధంగా మార్చుకుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు దుష్యంత్ కుమార్ గౌతమ్ విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న పథకాలకు వైసీపీ ప్రభుత్వం తాము ఇస్తున్నట్లు స్టిక్కర్లు వేసుకుంటుందని విమర్శించారు. ఈసందర్భంగా 9 ఏళ్ల మోదీ పాలనపై సేవ, సుపరిపాలన, సంక్షేమంపై కరపత్రాన్ని దుష్యంత్ కుమార్ ఆవిష్కరించారు.