SOMU VEERRAJU OPEN LETTER TO CM JAGAN : జాకీ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ఎందుకు వెనుదిరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది, బెదిరింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
పరిశ్రమలు స్థాపించడానికి ఎన్ని భూములు ఇచ్చారు.. ఎన్ని పరిశ్రమలు ప్రారంభించారనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విభజనాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా భూముల కేటాయింపులు జరిపిన విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమలు ఎందుకు ప్రారంభం కాలేదనే విషయాలపై వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా అని ప్రశ్నించారు. ఆ విషయాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరించడం లేదని తన లేఖలో నిలదీశారు. ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు భూముల వద్దకు వెళితే కబ్జాకు గురైన సంఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయని విమర్శించారు.
అధికార పార్టీ నేతలు ఈ తరహా కబ్జాలకు పాల్పడుతున్నందు వల్లే పలు సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినా.. ఆ తర్వాత వెనక్కి వెళుతున్నామంటూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కారిడార్లను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రప్రభుత్వం అందుకు అనుగుణంగా సింగిల్విండో విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం కావాలని తెలిపినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించాలంటే పరిశ్రమల ఏర్పాటు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని వీర్రాజు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: