High Court Judgment On APGEA : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసే సమావేశాలకు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అహ్వానించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. హైకోర్టు విచారణ బుధవారం చేపట్టింది. ఇరు పక్షాల నుంచి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ నెల 16న నిర్వహించే సమావేశంతో పాటు తర్వాత నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని(ఏపీజీఈఏ) అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. సమావేశాలకు తమను ఆహ్వానించాలంటూ ఏపీజీఈఏ ఈ నెల 10న సమర్పించిన వినతిని తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల గురించి అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేనేజ్‌మెంట్ కమిటీలో ఏపీజీఈఏ సభ్యత్వం కలిగి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సభ్యత్వం ఉన్న సంఘాన్ని సమావేశాలకు ఆహ్వానించకపోవడం ఏమిటంటూ ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ప్రభుత్వం పిటిషనర్ సంఘంపై వివక్ష చూపుతోంది : ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న తమ సంఘాన్ని ఉద్యోగ సంఘాలతో నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం ఆహ్వానించకపోవడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది వైవీ రవి ప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడం, తదితర సమస్యలపై పిటిషనర్ సంఘం గవర్నర్‌ను కలిసిందనే కారణంతో ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. దానిని హైకోర్టు తప్పుపట్టిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పిటిషనర్ సంఘంపై వివక్ష చూపుతోందని అన్నారు. సమావేశాలకు ఆహ్వానించడం లేదన్నారు.
ఆ సమావేశం అనధికారికమట: ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్య విచారణ అర్హతపై అభ్యంతరం తెలిపారు. సమావేశాలకు ఆహ్వానించకపోవడాన్ని సవాలు చేయలేరన్నారు. పదుల సంఖ్యలో సంఘాలు ఉన్నాయని వాటన్నింటిని ఒకే సారి సమావేశాలకు ఆహ్వానించలేమన్నారు. ఈ నెల 7న రెండు సంఘాలతో సమావేశం నిర్వహించామని అది అనధికారికమేనన్నారు. వారికి ఆహ్వానం పంపలేదన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి 7వ తేదీన సమావేశంలో చర్చించిన అంశాలను పరిశీలిస్తే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, సలహాదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. సభ్యత్వం ఉన్న పిటిషనర్ సంఘాన్ని పిలవకపోవడాన్ని తప్పు పట్టారు. ఈ నెల 16తో పాటు ఇకపై నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని అనుమతించాలని ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది.
ఇవీ చదవండి