low cost Medical tests at Lakshmi Polyclinic Diagnostic Center: 'మానవ సేవే మాధవ సేవ' అంటూ లక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యం సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే వైద్యాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. ఈసీజీ నుంచి మొదలుకొని ఎక్స్‌రే వరకూ సుమారు 126 రకాల వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకే అందిస్తోంది. అంతేకాదు, సాధారణ జ్వరాల నుంచి మధుమేహం, గైనకాలజీ వరకూ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఓపీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఓపీ ధర రూ.300 నుంచి రూ.500 వరకూ ఉంది. కానీ, లక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కేవలం రూ.100కే ఓపీ సేవలు అందిస్తున్నారు. మరీ ఈ ఆసుపత్రి ఎక్కడుంది..?, ఏయే వైద్య పరీక్షలు చేస్తారు..?, ఒక్కో వైద్య పరీక్షకు ఎంతెంత ధరను నిర్ణయించారు..?, ఆసుపత్రి సమయ వేళలు ఎలా ఉన్నాయి..? అనే వివరాలను తెలుసుకుందామా..
లక్ష్మీ ఫౌండేషన్‌లో తక్కువ ధరలకే వైద్య పరీక్షలు.. సామాన్య ప్రజలకు ప్రస్తుతం వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా అనారోగ్యం వస్తే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందించేందుకు లక్ష్మీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. విజయవాడలో ఆసుపత్రిని ప్రారంభించి.. వైద్యంతో పాటు వైద్య పరీక్షలను అతి తక్కువ ధరలకు అందిస్తోంది. వైద్య పరీక్షలు ప్రతి రోజు ఉదయం 7 గంటలను నుంచి ప్రారంభం అవుతాయని. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం పేర్కొంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య సేవలను.. ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని ఆసుపత్రి వైద్యులు విజ్ఞప్తి చేశారు.
2010 నుంచి ఫౌండేషన్ సేవలు ప్రారంభం.. విజయవాడ లయోలా కళాశాల రహదారి సమీపంలో లక్ష్మీ పాలిక్లినిక్ అండ్ డయాగ్నస్టిక్ సెంటర్ పేరుతో ప్రారంభమైన వైద్య కేంద్రం.. విశేషమైన సేవలు అందిస్తోంది. కమ్యూనికేషన్ పరికరాలను తయారు చేసే అవంటెల్ లిమిటెడ్ సంస్థ ఈ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సీఎండీ అబ్బూరి విద్యాసాగర్.. తన తల్లి లక్ష్మీ పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి.. 2010 నుంచి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరికీ అవసరమైన వైద్య పరీక్షల కోసం డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. సాధారణ జ్వరాల నుంచి మధుమేహం, గైనకాలజీ వరకూ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో.. కేవలం 100 రూపాయలకే ఓపీ సేవలను అందిస్తున్నారు. రక్త పరీక్షలన్నీ అధునాతన సౌకర్యాలతో తక్కువ ధరకే అందించాలని నిర్ణయించారు.
126 రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.. స్థోమత లేని వారికి పరీక్షల ధరలను మరింత తగ్గించి చేస్తున్నారు. సాధారణ బీపీ, షుగర్ పరీక్షల నుంచి 126 రకాల రక్త పరీక్షలు, ఈసీజీ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను ప్యాకేజీలుగాను అందిస్తున్నారు. డయాబెటిక్, సాధారణ హెల్త్, మాస్టర్ హెల్త్, ఉమెన్ వెల్‌నెస్, కిడ్నీ ప్యాకేజీలను వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. ఇంటికి వచ్చి రక్త నమూనాలను తీసుకొనే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. సేవలు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.