Amaravati movement starts from July: అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలంటే తక్షణమే రాజధాని అమరావతి నిర్మాణం జరగాలని.. ఏపీ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమై.. రాజధానిని నిర్మించి, పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పేదల కోసం 47 వేల ఇళ్లను మంజూరు చేస్తే, సీఎం జగన్.. వాటన్నింటిని కలిపి అమరావతిలో నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువత బాగుండాలంటే..అమరావతి నిర్మాణం జరగాలి.. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలన్నా.. రాజధాని అమరావతిని నిర్మించాలన్నారు. అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని.. తద్వారా యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.
జులై 17 నుంచి ఉద్యమం ప్రారంభం.. అనంతరం అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే కచ్చితంగా రాజధాని అమరావతిని నిర్మించి తీరాలని.. కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆర్ 5 జోన్ పేరుతో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన ధ్వజమెత్తారు. అమరావతే రాష్ట్ర రాజధాని పేరుతో దాదాపు 200ల రోజుల ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. మూడు దశల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న కొలికపూడి శ్రీనివాసరావు.. అందులో మొదటి దశగా.. జులై 17న హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని వెల్లడించారు.
జగన్ రెడ్డి 34 గజాల స్థలాన్ని సమీకరించగలరా..?.. టీడీపీ హయంలో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో అమరావతి రైతులు.. దాదాపు 34వేల ఎకరాలు ఇచ్చేశారని శ్రీనివాసరావు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనుల కోసం ఈ జగన్ రెడ్డి 34 గజాల స్థలాన్ని సమీకరించగలరా..? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం.. నిర్మాణంలో ఉన్న అమరావతి పనులను ఎక్కడికక్కడ నిలిపివేడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని.. ఏపీ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
''అప్పుల్లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేది అమరావతి నిర్మాణం ఒక్కటే. ఎందుకంటే అమరావతి నిర్మాణం జరిగితే..పెట్టుబుడులు వస్తాయి.. యువతకు ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ది చెందుతాయి. అమరావతి నిర్మాణం కోసం 200 రోజుల ఉద్యమ కార్యాచరణను సిద్దం చేశాం. అందులో మూడు దశలుగా ఉద్యమాన్ని విభజించాం. మొదటి దశ.. జులై 17న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ప్రారంభించి.. మోదీ అమరావతిలో చేసిన శంకుస్థాపన వరకూ పాదయాత్ర. రెండవ దశ.. తాడిపత్రి, మంగళగిరి నియోజకవర్గాలలో గడప గడపకు పాదయాత్ర. మూడవ దశ.. అమరావతి రథయాత్ర-జగన్ మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యం.''-కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ పరిరక్షణ సమితి నాయకుడు