All Party Meeting: రాజ్యాంగాన్ని గౌరవించని, ప్రజాస్వామ్య హక్కులంటే గిట్టని వైసీపీ ప్రభుత్వాన్ని.. 2024లో రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. అలా చేస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని స్పష్టంచేశాయి. ఈ పోరాటంలో తెలుగుదేశం పెద్దన్నపాత్ర పోషించాలన్న కోరాయి. అన్ని పక్షాలతో కలిసి సాగేందుకు సిద్ధమన్న ప్రధాన ప్రతిపక్షం... అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటామని స్పష్టంచేసింది.
విజయవాడలో అఖిలపక్ష సమావేశం: జైభీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యాన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు సహా ఇతర పార్టీల ప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టు సహా వైసీపీ ప్రభుత్వ వైఖరిని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. సీఎం జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గిట్టదని, మరే రాజకీయ పార్టీ ఉండకూడదన్నట్లు అరాచకాలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన దమనకాండ... చంద్రబాబు అరెస్టుతో పరాకాష్టకు చేరిందన్నారు. ఇప్పుడు లోకేశ్‌ను అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని జనసేన, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్లలో జగన్ 786 విధాన నిర్ణయాలు తీసుకున్నారని, 28వేల జీవోలు ఇచ్చారని... 2024లో అధికారం మారిన తర్వాత జగన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతాం: జగన్ అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలతో పాటు ప్రతిపక్షాలపై దమనకాండను ఇప్పటికే ప్రజలకు వివరించామని... తెలుగుదేశం నేత పట్టాభి తెలిపారు. స్కిల్ కేసులో వాస్తవాలు తెలియజేసేందుకు ఓ వెబ్‌సైట్ ఏర్పాటుచేశామని, ప్రజెంటేషన్‌లు ఇచ్చామని అన్నారు. 11 సీబీఐ కేసుల్లో సీఎం జగన్ ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆరు ఈడీ కేసుల్లో ఏ వన్ ముద్ధాయిగా ఉన్నాడని పట్టాభి ఎద్దేవా చేశారు. తాను తప్పు చేయలేదని సీఎం జగన్ ఎనాడైనా చెప్పాడా అని విమర్శించారు. పెద్దన్నపాత్ర పోషిస్తూ మిగిలిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడతామని స్పష్టంచేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
5 తీర్మానాలు ఆమోదించిన అఖిలపక్షాలు: అఖిలపక్ష సమావేశంలో 5 తీర్మానాలు ఆమోదించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఓ తీర్మానం, కేసులో కేంద్రం జోక్యం చేసుకుని శాంతిభద్రతలను కాపాడాలని మరో తీర్మానం ప్రవేశపెట్టారు. వచ్చే శనివారం గవర్నర్‌ను కలిసి విపక్షాలపై ప్రభుత్వ దమనకాండను వివరించాలని, సమయం ఇస్తే రాష్ట్రపతిని కలిసి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు.