AKHANDA KACHCHAPI MAHOTSAVAM: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో సప్తమ వార్షిక అఖండ కచ్ఛపీ మహోత్సవం వీణుల విందుగా సాగుతోంది. వీణానాదం తన్మయులను చేస్తోంది. పదుల సంఖ్యలో కళాకారులు తమ వేళ్లతో రాగాల చివురులను తొడుగుతున్నారు. సాక్ష్యాత్తూ సరస్వతి కొలువై సుమధుర స్వరాలను పలికించి సంతోషిస్తోందా.. అనే అనుభూతిని కళాకారులు పొందుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు, 12 గంటలపాటు నిరాటంకంగా వీణ కచేరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా ఈ కచ్ఛపీ మహోత్సవానికి హాజరయ్యారు. ముందుగా త్యాగరాజ పంచరత్న కీర్తనలతో వీణా వాద్య సమ్మేళనాన్ని కళాకారులు ప్రారంభించారు.
వీణకు ఎంతో ప్రాముఖ్యత: నట రాగంలో జగదానందకారకతో మొదలుపెట్టి.. గౌళరాగంలో 'దుడుకుగల నన్నే'.. అరభిరాగంలో సాధించనే ఓ మనసా.. వరాళి రాగంలో కనకనరుచిరా.. శ్రీరాగంలో ఎందరో మహానుభావులు అంటూ పంచరాగాలతో పంచరత్న కృతులను వీణపై ఎంతో శ్రావ్యంగా పలికించారు. పౌరాణికంగాను సాహిత్యపరంగానూ వీణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నానాటికీ వీణ కళాకారుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ఉత్సవాల ద్వారా కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా కొత్త కళాకారులను తీర్చిదిద్దేందుకు తమ సంస్థ అఖండ కచ్చపీ మహోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 15 న నిర్వహిస్తున్నట్లు శ్రీ సుబ్రమణ్య మహతీ సంగీత సమితి కార్యదర్శి సీవీ రావు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని వీణ కళాకారులు అందరినీ ఒకేచోటకు తీసుకొచ్చే ఉత్సవాన్ని నిర్వహించడం గొప్ప సాహసమేనని వీణకళాకారులు తెలిపారు.
"శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి 2016 ఆవిర్భావం జరిగింది. ఫిబ్రవరి 15 నాడు వీణ కళాకారులు ఉత్సవం చేద్దామని కోరగా వీణ డేగా అనౌన్స్ చేశాము. సప్తమ వార్షిక అఖండ కచ్ఛపీ మహోత్సవం జరుపుతున్నాము. సుమారు 33 మంది కళాకారులు పంచరత్న గీతంలో పాల్గొన్నారు." -శ్రీ సుబ్రమణ్య మహతీ సంగీత సమితి కార్యదర్శి సి.వి.రావు
ఇవీ చదవండి