OP Services in Government General Hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు రోజుల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆసుపత్రిలో ఉదయం పూట వైద్యులు రోగులను పరిశీలించి వైద్య పరీక్షలు రాస్తారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత వాటి ఫలితాలు అదే రోజు రావటం లేదు. దీంతో సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్న వాళ్లు సైతం ఫలితాల కోసం మరుసటి రోజు రావాల్సి వస్తుంది.
సాధారణంగా విజయవాడ లాంటి బోధనాసుపత్రులకు రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిలో అధికంగా పేదలే ఉంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వైద్య పరీక్షల కోసం మరోరోజు రావాలంటే కష్టమవుతుంది. రవాణా ఖర్చుల భారం మోయలేకపోతున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ తరహాలో వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పల్మనాలజీ, చర్మవ్యాధుల విభాగాల్లో వైద్యసేవల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం బోధనాసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
వైద్యులు సాయంత్రం ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యులు ఓపీలో విధులు నిర్వహించి.. మధ్యాహ్నం వైద్యకళాశాలలో విద్యార్ధులకు విద్యాబోధన చేస్తారని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్ డా.సౌభాగ్యలక్ష్మీ తెలిపారు. తాజా ఆదేశాలతో వైద్యకళాశాల ప్రిన్సిపల్, విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు వైద్యులు ఓపీ చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విజయవాడ జీజీహెచ్‌కు రోజుకు 2 వేల మందికి పైగా రోగులు ఓపీ ద్వారా వైద్యసేవలు పొందుతున్నారు. వీరిలో చాలామంది వైద్యపరీక్షల కోసం మరోరోజు వచ్చే వారే ఉంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సేకరించిన శాంపిల్స్ ఫలితాలు ఇచ్చేందుకు సాయంత్రం వరకు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా ఆదేశాలతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు వచ్చిన శాంపిల్స్ ఫలితాలను మూడు గంటల వరకు వచ్చే విధంగా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రుల సూపరింటెండెంట్, ప్రిన్సిపల్స్, మైక్రోబయాలజీ విభాగాధిపతులతో వైద్యశాఖ అధికారులు వీడియోకాన్ఫిరెన్స్ నిర్వహించారు. తాము పడుతున్న ఇబ్బందులు ఇకనైనా తీరతాయా అని రోగులు ఎదురుచూస్తున్నారు.
"హెల్త్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు.. 3 నుంచి 4 వరకూ కూడా ఓపీ సేవలు ఉంటే ఉదయం వచ్చిన రోగులు వైద్య పరీక్షలు పూర్తైన తరువాత చూపించుకుంటారు అని చెప్పారు. దానిపై ప్రాతిపదిక ఏంటి.. నాలుగు దాటిపోతే మిగిలిన రోగులను పరిస్థితి ఏంటి.. ఇలా కొన్ని క్లారిఫై అవ్వాల్సి ఉంది. వీటిని క్లారిఫై చేసుకుని.. 3 నుంచి 4 ఓపీ సేవలు రన్ చేస్తాం". - డా.సౌభాగ్యలక్ష్మీ, విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్
ఇవీ చదవండి: