Labourers Trapped in Munneru Flood in NTR District : గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో, తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు పోటెత్తింది. మున్నేరులో వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహిస్తోంది. పెనుగంచిప్రోలు వద్ద వంతెన అంచులకు తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ తరుణంలో పోలానికి వెళ్లిన రైతులు, కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి వారిని కాపాడింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల వద్ద మున్నేరు వరదల్లో 11 మంది రైతులు, కూలీలు చిక్కుకున్నారు. గురువారం ఉదయం చెరకు తోటలో పనికి వెళ్లి మున్నేరు వరద పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి వెళ్లిన ఇద్దరూ సైతం వరదల్లోనే ఇరుక్కున్నారు. టీడీపీ నాయకురాలు తంగిరాల సౌమ్య అధికారులకు సమాచారం అందించారు. బాధితులను రక్షించడానికి అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. మున్నేరు అవతల ఒడ్డు నుంచి సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. అలాగే మునుగోడు లంకలో 14 మంది గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. మున్నేరుకు వరద పోటెత్తడంతో చందర్లపాడు మండలం విపరింతలపాడు వద్ద గొర్రెల కాపరులతో వెయ్యి గొర్రెలు చిక్కుకున్నాయి.
రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు : వ్యవసాయ కూలీలను రక్షించేందుకు రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు దిగాయి. వరదల్లో చిక్కుకున్న 13 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. గురువారం ఒక్కసారిగా 1,50,000 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు మండలాలను వరద ముంచెత్తింది. నందిగామ, కంచికచర్ల మండలాల పరిధిలో మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు ఉద్ధృతి మీదున్నాయి. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లకు సంబంధించిన వరద పోటెత్తుతోంది. కీసర వద్ద కలిసే మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు జోరుతో 67 వేల క్యూసెక్కుల ప్రవాహం.. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద కృష్ణా నదిలోకి చేరుతోంది. ఏర్ల ఉద్ధృతితో ఆయా ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీసులను కాపలా పెట్టారు.
ఇక వైరా ఏరు, కట్టలేరు వరద ప్రవాహంతో నందిగామ - వీరులపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. లింగాల వంతెన నీట మునిగింది. ఆలయం దిగువన బోస్పేటలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలంతా బయటికి వచ్చారు. అధికారులు వారికి వసతి ఏర్పాటు చేస్తున్నారు. దిగువన ఉన్న గుమ్మడిదూరు, అనిగండ్లపాడు వద్ద మున్నేరు పోటెత్తి పంట పొలాలను ముంచింది. వరద ఉద్ధృతి గంట గంటకు పెరగటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 14 అడుగులు దాటింది.