Person Protest at Tadepalli CM Residence With Mic: రాష్ట్రంలో వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార బలంతో యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. వైసీపీ నేతల నుంచి కాపాడాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంటున్నారు. తమ గోడు వినాలంటూ మైకెత్తి జగన్‌ను వేడుకుంటున్నాడు నంద్యాల జిల్లాకు చెందిన ఓ బాధితుడు.
చేతిలో మైక్ పట్టుకుని తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం చుట్టూ తిరుగుతూ తన గోడును వెళ్లబోసుకుంటున్న ఆ వ్యక్తి పేరు సిద్దంరెడ్డి రమణారెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట్లకు చెందిన రమణారెడ్డి కుటుంబానికి చెందిన 16 కోట్ల విలువైన భూమిని వైసీపీ నేత పలుచాని బాలిరెడ్డి కుమారులు దౌర్జన్యంగా లాక్కున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
నాలుగు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నా.. పట్టించుకునే వారే లేరన్నారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మోసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితుడు వాపోయాడు. చిత్తశుద్ధి ఉంటే తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయం చేయలేకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలంటూ రాసిన స్టిక్కర్లను, తనను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్‌తో, ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలను తన కారుకు అతికించి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసి వెళ్లారు.
YSR Yantra Seva Scheme మాదే ప్రభుత్వం.. మాకే యంత్రాలు..! ఇదే గ్రామస్వరాజ్యం అంటున్న జగన్..
స్పందనలో 33సార్లు ఫిర్యాదు చేశానని సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే అనుమతి లభించడం లేదని రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడు వినాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు వినిపించేలా మైకు పట్టుకుని సీఎం నివాసం వద్ద తిరుగుతున్నాడు.
"స్పందనలో ఫిర్యాదు చేశాను. ఎస్పీని కలిశాను. కర్నూలులో కూడా దరఖాస్తు ఇచ్చాను. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా వాళ్లు సివిల్ కేసు అంటున్నారు. ఎక్కడా ఫిర్యాదు చేసినా అది స్థానిక సీఐ దగ్గరికి వస్తోంది. వాళ్లేమో నువ్వు ఎక్కడ ఫిర్యాదు చేసినా ఇక్కడికే వస్తుంది. స్థానికంగా వాళ్లు మేము ఏం చేయలేమని అంటున్నారు." -సిద్దంరెడ్డి రమణారెడ్డి, బాధితుడు
Illegal Sand Mining: వైసీపీ నేతల అక్రమాలు.. గుత్తేదారు ముసుగులో ఆగని ఇసుక దోపిడి..
వైసీపీ నేత బాలిరెడ్డితో కలిసి తన తండ్రి పురుగు మందుల వ్యాపారం చేయగా.. వచ్చిన లాభాలతో భూములు కొనుగోలు చేశారని రమణారెడ్డి తెలిపారు. ఆ భూముల్లో తమకు రావాల్సిన 16 కోట్లు ఇవ్వకుండా బాలిరెడ్డి కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి, ఆయన సోదరులు దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు మల్లికార్జునరెడ్డి ప్రధాన అనుచరుడని.. ఆస్తి గురించి అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని రమణారెడ్డి వాపోయారు. వైసీపీ నేతల అరాచకానికి తనతో పాటు కుటుంబం తీవ్ర మనోవ్యథకు గురవుతోందని.. సీఎం జగన్ స్పందించి న్యాయం చేయాలని బాధితుడు రమణారెడ్డి వేడుకుంటున్నారు.
Land Issues: భూముల్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. రోడ్డెక్కిన అన్నదాతలు