SHIVRATRI BRAHMOTSAVALU ENDED AT SRISAILAM TEMPLE : శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఫిబ్రవరి 11న ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో పూర్తి అయ్యాయి. ఉత్సవాల ముగింపు రోజున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భక్తులకు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తలను శోభాయమానంగా అలంకరించి.. అశ్వ వాహనంపై కొలువు తీర్చారు. ఆది దంపతుల పుష్పోత్సవాన్ని పురస్కరించుకొని 21 రకాల.. వివిధ వర్ణాల పుష్పాలు, పలు రకాల ఫలాలను సమర్పించారు. ఏకాంత సేవ నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు.
శివరాత్రి రోజున రమణీయంగా కళ్యాణం: మహాశివరాత్రి రోజున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణం రమణీయంగా సాగింది. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పరిణయానికి ముస్తాబు చేసి నంది వాహనంపై కొలువు తీర్చారు. అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేసి.. అనంతరం నంది వాహనంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ప్రాంగణం నాగుల కట్ట వద్ద దేవదేవులకు కల్యాణ వేదికను అత్యంత వైభవంగా అలంకరించారు. వివిధ వర్ణాల సోయగం.. సుమధుర పుష్పాలంకరణ వేదిక మధ్యన దేవదేవులు ఆది దంపతులుగా కొలువుదీరారు.
అంతకుముందు ఫిబ్రవరి 11న ఉదయం 8.46 గంటలకు ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు చేశారు. ఈ పూజలకు దేవస్థానం ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, అర్చకులు, వేద పండితులు శ్రీకారం చుట్టారు. ఆరోజు సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆదిదంపుతులైన భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.
ఇవీ చదవండి: