Farmers protest Against National Highway : అధికార పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులు తమకు మేలు జరిగేలా నంద్యాల - జమ్మలమడుగు మధ్య నూతనంగా నిర్మించే జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నారని.. అలా చేయడం తగదని రైతులు తెలిపారు. నంద్యాల - జమ్మలమడుగు మధ్య నిర్మించే జాతీయ రహదారి రూపకల్పనలో పలు మలుపులు తిప్పి పేద రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం అధికారులు చేస్తున్న భూమి సర్వేను అడ్డుకుని రైతులు.. తమ పొలాల వద్ద ఇవాళ నిరసన తెలిపారు. అక్కడే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. తమ పొలాల మధ్య నుంచి కాకుండా పక్కనే ఉన్న రహదారికి ఇరువైపుల జాతీయ రహదారి నిర్మించాలని రైతులు సూచించారు. కర్షకులకు సంఘీభావం తెలుపుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు అధికార పార్టీ నాయకులకు చెందిన వెంచర్లు ఏమాత్రం నష్టం లేకుండా రైతుల పొలాల్లో రహదారి ఏర్పాటు చేయడాన్ని రైతులు, సీపీఎం నాయకులు తప్పు పట్టారు. రహదారి నిర్మాణం తమ పొలాల్లో కాకుండా పక్కన రహదారిపై ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మా భూమి పక్కనే రోడ్డు ఉంది. అదికాదని పెద్దవాళ్ల భూములు కాపాడుకోవటం కోసం మా భూమి మధ్యలో నుంచి రోడ్డు వేస్తే మేము ఎలా బతకాలి. ఉన్న రోడ్డుకు ఇరు పక్కల భూములను తీసుకోని రహదారి వేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. - రామ చెన్నమ్మ, బాధితురాలు, రైతునగర్, నంద్యాల జిల్లా
మేము 167 రోడ్డుకు వ్యతిరేకం కాదు. మా పొలం పక్కన 30 అడుగుల రోడ్డు ఉంది దాన్ని వదిలి పెట్టి మా పొలాల మధ్య నుంచి రోడ్డు వేస్తున్నారు. అలా కాకుండా ఉన్న రోడ్డుకు ఇరువైపుల సరిపడా భూమి తీసుకోవాలని కోరుతున్నాము. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే చూద్దాంలే అని సమాధానం ఇచ్చారు. అలాగే జాయింట్ కలెక్టర్ కి చెబితే అవి ప్రభుత్వ భూములు మీరు అడగడానికి వీల్లేదు అని అన్నారు. మేము కోరేది ఏమంటే ఉన్న రోడ్డుకే రెండువైపులా భూములు తీసుకొని జాతీయ రహదారి వేయాలని కోరుతున్నాం. -శంకర్ రావు, బాధితుడు, రైతు నగరం, నంద్యాల జిల్లా
నంధ్యాల నుంచి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణం ప్లాన్ ప్రకారం కాకుండా కొత్త ప్లాన్ వేసి కానాల గ్రామంలో పేద రైతుల భూముల మధ్యలో మార్కింగ్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు,అధికార పార్టీ నాయకులు, బడా భూస్వాముల భూములు కాపాడే విధంగా ప్రభుత్వం ప్లాన్ రూపొందించింది. దీని కారణంగా పేద రైతులు ఎక్కువగా నష్టపోతారు. అలాగే ప్రభుత్వం గ్రామంలో గ్రామ సభలు జరపకుండా, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ప్రణాళికలు వేసింది. కావున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రామ సభలు జరపి, రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోని రైతులకు తక్కువ నష్టం కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. - రామచంద్రుడు, రైతు సంఘం, సీపీఎం నాయకులు
ఇవీ చదవండి :
డబ్బుల కోసం కొడుకుని అమ్మేసిన తండ్రి.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
Balayya Fans Protest: హిందూపురంలో వీరసింహరెడ్డి 100 రోజుల వేడుక.. అధికారుల అనుమతి నిరాకరణ
Conflict: తూర్పు గోదావరిలో దారుణం.. విద్యార్థిని చాకుతో పొడిచి..!