Case of lumpy skin disease: నంధ్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలో ఓ కోడె దూడకు లంపి స్కిన్ వ్యాధి నిర్ధారణ అయినట్లు పశు వైద్యులు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదే మొదటి కేసుగా వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన అభిమన్యు అనే రైతు గత నెల డోన్ పశువుల సంతలో తెలంగాణలోని కోదాడ నుంచి వచ్చిన కోడె దూడను కొనుగోలు చేశారు. కొన్న నాలుగు రోజులకు దూడకు శరీరమంతా గుల్లలు, దద్దుర్లు రావడంతో రైతుకు అనుమానం వచ్చింది. దాంతో అతను పశు వైద్యులను సంప్రదించారు. అధికారులు దూడను నుంచి నమూనాను సేకరించి మధ్యప్రదేశ్‌లోని ల్యాబ్‌కు పంపారు.
అలాగే ఉమ్మడి జిల్లాలో అనుమానిత 16 నమూనాలను సేకరించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వాటిలో కేవలం చనుగొండ్ల దూడకు మాత్రమే లంపి వ్యాధి సోకినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పశు వైద్యులు గ్రామం చుట్టూ 5 కిలోమీటర్లు పరిధిలో ఉన్న పశువులకు ఆ వ్యాధి సోకకుండా వాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తుగా డోన్ పశువుల సంతను మూసివేశారు. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రబలే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో కళ్లు, ముక్కు నుంచి స్రావాలు వస్తుంటాయని వైద్యులు తెలిపారు. శరీరమంతా పొక్కులు, మచ్చలు ఏర్పడతాయని వెల్లడించారు. నోటిలో బొబ్బలు వస్తాయని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి తగ్గుతుందని. పశువులు తినడానికి ఇబ్బంది పడుతుంటాని.. దాంతో పశువులు మృతి చెందుతాయని పశు వైద్యులు వెల్లడించారు.
ఇవీ చదవండి: