Illegal land acquisition: భూకబ్జాదారుల దౌర్జన్యంతో.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు అన్నదమ్ములు గురువారం ఆత్మహత్యకు యత్నించారు. వారిని చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం.. ఎమ్మిగనూరుకు చెందిన నరసన్న భార్య బోయ తిప్పమ్మ.. జి.నరసమ్మ నుంచి సర్వే నంబర్లు 145, 146, 148/సీలలో 7.92 ఎకరాలను 37 ఏళ్ల క్రితం కొని, ఒప్పందపత్రం రాయించుకున్నారు. అప్పటి నుంచి పొలాన్ని ఆమె సాగు చేసుకుంటున్నారు. ఆమె పేరిట పాసుపుస్తకం, అడంగల్, ఆర్వోఆర్‌లో వివరాలు ఉన్నాయి. పొలం విక్రయించిన నరసమ్మ 2010లో మరణించారు.
ఆమెకు కుమారుడు మోహన్‌కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కానీ తానొక్కడినే సంతానం అన్నట్లు రెవెన్యూ అధికారులకు మోహన్‌కృష్ణ తప్పుడు సమాచారం ఇచ్చి తల్లి మరణ ధ్రువపత్రం, కుటుంబసభ్యుల ధ్రువపత్రం పొందారు. నరసమ్మ అమ్మిన పొలాన్ని తిప్పమ్మకు రిజిస్ట్రేషన్ చేయించలేదని, ఒప్పందపత్రం మాత్రమే రాశారని ఆయనకు తెలిసింది. రెవెన్యూ అధికారి సహకారంతో మోహన్‌కృష్ణ పొలాన్ని తన పేరిట ఆన్‌లైన్ చేయించుకున్నాడు. పొలం విలువ పెరగడంతో రెవెన్యూ అధికారి, మోహన్‌కృష్ణతో పాటు ఎమ్మెల్యే తమ్ముడి కుమారుడు విరూపాక్షరెడ్డి, ఆయన సహాయకులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులైన భాస్కర్ల చంద్రశేఖర్, వై.శ్రీనివాస్‌గౌడ్, పెబ్బేటి శ్రీనివాసులురెడ్డి, చంద్రకళ కలిసి మోహన్‌కృష్ణ నుంచి 2020లో రూ.1.02 కోట్లకు ఆ భూమి కొన్నట్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది తెలిసిన బోయ తిప్పమ్మ, ఆమె కుమారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అక్కడ వారికి అనుకూలంగా ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది.
ఠాణాలో ఫిర్యాదు చేసినా..
పొలంలో తిప్పమ్మ మొక్కజొన్న సాగుచేశారు. చేతికొచ్చిన పంటను విరూపాక్షరెడ్డి, ఆయన అనుచరులు దౌర్జన్యంగా కోసుకెళ్లగా జనవరి 17న బాధితులు ఠాణాలో ఫిర్యాదుచేశారు. గురువారం మొక్కజొన్న కోసిన పొలానికి ట్రాక్టరు తెచ్చి వారు దున్నుతుండగా తిప్పమ్మ, ఆమె కుటుంబసభ్యులు అడ్డుకొని గొడవపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగి తిప్పమ్మ కుమారులు రాజేశ్, రమేశ్ పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స కోసం వారిద్దరినీ తొలుత ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎమ్మార్వో జయన్నను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, అది పట్టా భూమి అని, పూర్తి వివరాలు తనకు తెలియవని చెప్పారు.
ఇవీ చదవండి:
తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి పవర్ కట్.. బయటే విధులు
ఇప్పటివరకు మౌనంగా ఉన్నాం.. ఇలాగే కొనసాగితే సహించేది లేదు.. ఖబడ్డార్: బండి శ్రీనివాస్
పెళ్లి పీటలెక్కనున్న రాకేశ్- సుజాత.. ఈ నెలలోనే ఎంగేజ్మెంట్