కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారపర్వం రేపటితో ముగియనుండగా.. వివిధ వార్డుల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నగరంలోని 52 వార్డుల్లో 2 చోట్ల వైకాపా అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన వార్డుల్లో అధికార పార్టీ, తెదేపా పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. తెదేపా తరపున టీజీ భరత్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండగా.. మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక వైకాపాకు మద్దతుగా రంగంలోకి దిగారు. నేడు వేర్వేరు సమయాల్లో 44వ వార్డులో వారిరువురూ ఓట్లు అభ్యర్థించారు.
ఎమ్మిగనూరులో...
మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. తెదేపా హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయి తప్ప వైకాపా పాలనలో శూన్యమని విమర్శించారు. పురపాలక సంఘం పరిధిలో రూ.148 కోట్లతో తాగునీటి పథకం నిర్మాణం అప్పట్లో ప్రారంభించామన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా నీరు అందించడానికి ప్రాజెక్ట్ తీసుకొస్తే.. దానికి టెంకాయ కొట్టి ట్యాంక్ నిర్మాణానికి సేకరించిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి కోసం తెదేపా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పురపాలిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా సీపీయం అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని 37వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో ఆ పార్టీ అభ్యర్థి వేముల లతకు మద్దతుగా.. కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ రంగంలోకి దిగారు. తమ అభ్యర్థులను గెలిపించాలని కాలనీవాసులను కోరారు. డబ్బు తీసుకుని ఎన్నికల్లో ఓటు వేస్తే.. గెలిచిన వారు పని చేయరని అన్నారు. పనిచేసే వారినే గెలిపించాలని సూచించారు. ఎన్నికలు వ్యాపారంగా మారాయని ఆరోపించారు. ఇందిరాగాంధీ నగర్లో సీపీఎం అభ్యర్థి నిర్మలమ్మ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
నంద్యాలలో...
ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కౌన్సిలర్లుగానూ వారినే ఎన్నుకోవాలని కోరారు. తెదేపా అభ్యర్థులను తరపున మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రంగంలోకి దిగారు. తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. స్థానిక సాయిబాబానగర్లో ఓ చోట.. ఇరు పార్టీల ప్రచారం కొద్దీ దూరంలో తారసపడింది. ప్రచార రథాల మైకులు పాటలతో దద్దరిల్లాయి.
మార్పు కోరుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రజలకు సూచించారు. నగరంలోని 44వ వార్డులో మహమ్మద్ రఫీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు.. ఆప్ నేతలు అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే పార్టీలను కాకుండా.. అనంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వాటికి అధికారం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
ఆర్టీసీ బస్సుల్లో 16.5 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్