కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయనేత దివంగత భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎ.వి. సుబ్బారెడ్డి. ఇప్పుడు ఆయనకు... నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మద్య తీవ్ర రగడ నడుస్తోంది. ఒకరి పేరు చెబితేనే మరొకరు భగ్గుమనే పరిస్థితి. చివరకు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ తనను చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించడం సంచలనం రేకెత్తిస్తోంది.
రగడ మొదలైంది ఇలా..!
కడప చిన్నచౌకు పోలీసులు మార్చి 23న బైపాస్ రోడ్డు వద్ద ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.50 లక్షల నగదు, తుపాకీ, తూటాలు స్వాధీనపరచుకున్నారు. తెదేపా నేత సుబ్బారెడ్డిని హత్య చేయడానికి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ నాయుడు సుబ్బారెడ్డి హత్యకు 50లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారని నిందితులు విచారణలో తెలిపారు. ఆ తర్వాత భార్గవ్‌రామ్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిని కూడా అరెస్టు చేశారు. హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని కడప పోలీసులు వారం రోజుల కిందట నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన హాజరు కాలేదు. రెండోసారి శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
ప్రేమగా పెంచితే చంపాలని చూస్తారా..?
పోలీసు నోటీసుల తర్వాత సుబ్బారెడ్డి స్పందించారు. నాగిరెడ్డితో తన కుటంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉందని... పిల్లలను తన పిల్లలతో సమానంగా అఖిలప్రియను చూసుకున్నామన్నారు. 'నా ముగ్గురు కూతుళ్లతో కలిసి అఖిలప్రియను ప్రేమగా చూసుకున్నా. కానీ ఆమె.. తన భర్తతో కలిసి నన్ను చంపాలని చూస్తోంది. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజూరెడ్డితో నన్ను చంపించేందుకు 50 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. అఖిలప్రియ కుట్రను కడప పోలీసులు భగ్నం చేసి నన్ను కాపాడారు' అని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.
ఆళ్లగడ్డకు వస్తే స్వాగతిస్తా...
సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అఖిలప్రియ శుక్రవారం స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో తనను, తన భర్త భార్గవ్‌రామ్‌ను పోలీసులు నిందితులుగా ఉంచారని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ఆయన రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని, ఆయనకు పార్టీలో పదవులిస్తుంటే తాను అడ్డుపడలేదని తెలిపారు. హైకోర్టులో తన భర్త బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకే ఆయన ప్రసార మాధ్యమాల ద్వారా అరెస్టుకు డిమాండ్ చేశారని తెలిపారు. నిందితుల నేరాంగీకార పత్రంలో తామే ఈ నేరానికి పాల్పడినట్లు స్పష్టంగా లేదన్నారు. తమపై కేసుల నమోదు వెనుక ప్రభుత్వ హస్తం ఉందని తాను భావించడం లేదని, స్థానిక నాయకుల పాత్ర ఉందనుకుంటున్నట్లుగా చెప్పారు.
నాకే రాజకీయం నేర్పుతుందా?
అఖిలప్రియ మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్లీ సుబ్బారెడ్డి స్పందించారు. తనపై హత్యాయత్నం కేసులో అఖిలప్రియ ముద్దాయి అని తెలుసుకుని షాక్ తిన్నాను అన్నారు. ఇది తాము ఊహించలేదని చెప్పారు. ఆళ్లగడ్డ వచ్చి రాజకీయం చేస్తే స్వాగతిస్తామని అఖిలప్రియ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచే తాను ఆళ్లగడ్డలో రాజకీయం చేశానని.. ఇప్పుడు తనను ఆళ్లగడ్డ వచ్చి రాజకీయం చేసుకోమని చెబుతారా అని ప్రశ్నించారు. " అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న. ఈ విషయంపై ఆమె సమాధానం చెప్పాలి" అన్నారు. "అఖిలప్రియపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ దాడిలో నేను చనిపోయినా... నా కుటుంబసభ్యులు అఖిలప్రియపై అనుమానం కూడా వ్యక్తం చేసేవారు కాదు. పోలీసులు చెబితేనే నా హత్యకు కుట్ర పన్నారన్న విషయం తెలిసింది" అన్నారు.
నాలుగుదశాబ్దాల పాటు నాగిరెడ్డి కుటుంబంతోనే సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత అఖిలప్రియతో విభేదాలు తలెత్తాయి. భూమా మరణం తర్వాత నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు సుబ్బారెడ్డి అఖిలప్రియతో కలిసే పనిచేశారు. అఖిలప్రియ సోదరుడు బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత ఈ కుటుంబాల మధ్య దూరం పెరిగింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు సుబ్బారెడ్డి హత్యకు కుట్రపన్నారని అఖిలపై అభియోగాలు రాగా.. వీరి మధ్య దూరం వైరంగా మారింది.
ఇవీ చదవండి..సర్వేయర్‌పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?