కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల కేంద్రం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో నల్లమలలో ఉన్న జానాలగూడెంకు చెందిన తిక్కస్వామి, బాలయేసమ్మలకు కుమారుడు, కూమార్తె ఉన్నారు. చేపల వేట ఆ కుటుంబానికి జీవనాధారం. పెద్ద కుమార్తె కవిత చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చూపుతోంది. తమ బంధువుల సాయంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఏపీటీడబ్ల్యూఆర్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి పగిడ్యాల మండలం లక్ష్మాపురంలోని పాఠశాలలో 8వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత మళ్లీ ఏపీటీడబ్ల్యూఆర్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కూల్) ప్రవేశ పరీక్షకు ఎంపికై కడప పులివెందులలో 9, 10వ తరగతి పూర్తి చేసింది. పది పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు ఆర్టీడీ సంస్థ నిర్వహించే సెట్ పరీక్షలో ఔరా అనిపించి ప్రతినిధులను మెప్పించింది.
ఆర్టీడీ సంస్థ కవిత కుటుంబ జీవనం, సౌకర్యాలు తెలుసుకుని చలించిపోయారు. ఇంటర్ విజయవాడలోని చైతన్య కళాశాలలో సంస్థ ఖర్చులు భరించి చదివించింది. ఆ తర్వాత నీట్‌లో మంచి ర్యాంకుతో విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో సీటు సాధించి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
కొత్తపల్లి మండల పరిధిలోని ఎర్రమఠం పంచాయితీలో జానాలగూడెం, బలపాలతిప్ప, పాత సిద్ధేశ్వరం గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 142 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామాలకు చేరాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. ఐదు కి.మీలు కాలినడకే. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండవు. విద్యుత్ ఊసే లేదు. రక్షిత తాగునీరు దొరకదు. కొట్టాల్లోనే జీవనం. చినుకు రాలితే ఇబ్బందులు తప్పవు. నల్లమల అటవీ ప్రాంతంలో లోపలికి ఉండటంతో అధికారులు అక్కడికి రారు. సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించరు. అలాంటి జానాలగూడెంలో కవిత కుటుంబం కూడా నలభై ఏళ్ల నుంచి ఉంటుంది. కవిత ఇంటికొచ్చినప్పుడల్లా లాంతరు వెలుగులోనే చదవుకుంటుంది.
అనంతపురానికి చెందిన ఆర్డీటీ ఇంటర్ నుంచి కవిత చదువుకు సహకరిస్తున్నారు. గూడెంలో చదువుకునే పిల్లలు డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, తనూ అదే సమస్యలు ఎదుర్కొన్నట్లు కవిత తెలిపారు. రాత్రిళ్లు పాములు, తేళ్లతో ప్రమాదాల బారిన చాలామంది పడ్డారని, వైద్యం కోసం ఐదు కి.మీ కాలినడకనే వెళ్లాల్సి వస్తుందన్నారు. అయితే జానాలగూడెంలో 37 ఇళ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యంకై సోలార్ పలకలు ఆర్డీటీ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను వృద్ధిలోకి వచ్చి తన గ్రామాన్ని రూపురేఖలు మార్చడమే లక్ష్యం అంటున్నారు కవిత.
ఇదీ చదవండి; పసిడి ప్రియం.. భారీగా దిగొచ్చిన వెండి