కర్నూలు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరవైంది. వేటగాళ్ల ఉచ్చులోపడి విలవిలలాడుతున్నాయి. నిఘా కొరవడటంతో పట్టపగలే పొట్టనపెట్టుకుంటున్నారు. 11 జింకలను వేటాడి వాటి మాంసం, చర్మాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదోని మండలం నారాయణపురం గ్రామ పొలాల్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆదోని డివిజన్ పరిధిలో జింక(బ్లాక్‌బక్)లు అధికంగా ఉన్నాయి. వీటి సంరక్ష కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్‌బక్ మరుగునపడటం వన్యప్రాణుల పాలిట మరణ శాసనంగా మారింది.
కర్ణాటక వారి పనేనా..
మందలుగా సంచరిస్తున్న జింకల(బ్లాక్‌బక్)పై వేటగాళ్లు కన్ను పడింది. నారాయణపురం గ్రామ సమీప పొలాల్లో 11 జింకలను హతమార్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దుండగులు వాటిని చంపి మొద్దులపై మాంసాన్ని ముక్కలుగా చేసుకొని తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విషప్రయోగం చేసి చంపారా లేక తుపాకులతో కాల్చారా అన్నది తేలాల్సి ఉంది. వేటగాళ్లు హిందీ భాష మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలం వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన గుట్కా పొట్లాలు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వేటగాళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారై ఉండొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Deers Dead: నడి రోడ్డుపై రెండు జింకలు మృతి.. ఏం జరిగింది?