పుష్కరాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని ‘ఈ-టికెట్టు’ విధానాన్ని అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. పిండ ప్రదానం వంటి కార్యక్రమాలకు స్లాట్‌లో అర్ధగంట సమయం కేటాయించారు. ఇలా రూపొందించిన సాఫ్ట్‌వేర్ సిద్ధమైంది. ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ దీన్ని రూపొందించింది. ఏపీ సర్వర్‌లో అభివృద్ధి చేసి సిద్ధంగా ఉంచినట్లు పర్యవేక్షణాధికారి జేసీ రాంసుందర్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన ప్రకారం పుష్కర స్నానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే పిండ ప్రదాన కార్యక్రమం అనంతరం చేసే స్నానాలకు అనుమతి ఉందా? లేదా? అనే ప్రశ్నలకు జిల్లా అధికారులకు సమాధానం ఇవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో 21 ఘాట్ల నిర్మాణాలను రూ.22.92 కోట్లతో చేపడుతున్నారు. అయితే ఘాట్ల వద్ద ఎవ్వరూ దిగకుండా కట్టడి చేసేందుకు పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. పిండ ప్రదానాలు చేసిన వారికి మునిగే అవకాశం ఉంటేనే స్లాటు బుకింగ్ విధానం అమల్లోకి తెస్తామని, లేదంటే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేది ఉండదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మంత్రాలయం దేవస్థానం వెనుక వైపు గతంలో ఒక ఘాట్ ఏర్పాటు చేసి ఉండగా, మరో ఘాట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటికయ్యే ఖర్చు దేవస్థానమే భరిస్తుంది. ఇప్పటికే పీఠాధిపతి ఆదేశాలతో మఠం అధికారులు కర్ణాటక, ఆంధ్ర ముఖ్యమంత్రులతో పాటు, భాజపా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి పుష్కర స్నానాలకు ఆహ్వానించారు. 2008లో తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు జిల్లాలో 49 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి పుష్కరాలకు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో ఆసక్తి చూపకపోవడం, కర్నూలులోనూ పుష్కర స్నానానికి అనుమతి లేదని చెప్పడంతో పన్నెండు రోజుల్లో భక్తుల హాజరు చాలా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి