అదేమీ మారుమూల పల్లె కాదు. కొండ కోనల్లో ఉన్న తండా అంతకంటే కాదు. జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, ప్రధాన రహదారికి పది కిలో మీటర్లు దూరంలో ఉన్న గ్రామం. కేవలం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామస్థులు పదేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే అక్కడివారంతా ఏకమయ్యారు. ఎన్నికలను బహిష్కరించి.. మాకు పాలకులతో పనిలేదు. పదేళ్లైన మా సమస్యను పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పుడు ఎన్నికలతో మాకేంటి అంటున్నారు కర్నూలు జిల్లాలోని పూడూరు గ్రామ ప్రజలు.
ఎన్నికలు బహిష్కరణ..
తమ గ్రామానికి రహదారి వెస్తేనే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని తేల్చి చెబుతున్నారు. రహదారి సరిగా లేక పది సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నా.. ఇంతవరకు ప్రజా ప్రతినిధులుగాని అధికారులుగాని పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా గ్రామానికి రోడ్డు వేస్తేనే ఎన్నికలకు ముందుకొస్తాం.. లేకుంటే నామినేషన్లతోపాటు ఓటు కూడా వేసేది లేదంటూ గ్రామస్థులంతా ఏకమయ్యారు.
గ్రామంలో చాటింపు..
ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి రోడ్డు మాత్రం మారటం లేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయకుకుడదని గ్రామస్థులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయంపై గ్రామంలో చాటింపు కూడా వేయించారు. విషయం తెలుసుకున్న అధికారులు పూడూరు గ్రామానికి వెళ్లి.. గ్రామస్థులతో మాట్లాడారు. రోడ్డు వేస్తామని హామీ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తామని గ్రామ నిర్ణయాన్ని తెదేసి చెప్పారు.
అంబులెన్స్ రాక గర్భిణులు మృతి..
తమ గ్రామం నుంచి కర్నూలుకు 10 నుంచి 15 రూపాయలు చార్జీ ఉండగా.. రోడ్డు సరిగాలేనందుకు ఆటోకి 50 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇక ఊరికి అంబులెన్స్ కూడా రాక గర్భిణులు ఆటోలో వెళ్తుండగా మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగాలేక తమ ఊరి వాళ్లకు పెళ్లి సంబందాలు సైతం రావటం లేదని ఆందోళన చెందుతున్నారు.
తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఎన్నికల్లో పాల్గొనేంది లేదని తేల్చి చెబుతున్నారు. గ్రామస్థులు ఎవరూ ఓటు వేయకుండా ఎలక్షన్లను బహిష్కరిస్తామని ముక్తకంఠంతో తేల్చేశారు. మరి ఇకనైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే విషయం తెలియాలంటే కొంత కాలం వెచి చూడాల్సిందే.
ఇవీ చూడండి.. మొత్తం 1,243 సర్పంచ్, 4420 వార్డులకు నామినేషన్లు