Rayalseema Gharjana: కర్నూలులో ఈనెల 5న నిర్వహించనున్న రాయలసీమ గర్జనకు హాజరుకానివారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించే సభకు వైసీపీ మద్దతిస్తోందని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బుగ్గన తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై ఈ సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. ముందు తరాల భవిష్యత్ కోసం మాతో కలిసి రావాలని అన్నారు. మరోవైపు మూడు రాజధానుల పేరు చెప్పి వైసీపీ మోసానికి పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపించింది. కర్నూలుకు హైకోర్టు తీసుకువస్తామంటే ఎవరూ కాదన్నారని.. అధికారంలో ఉండి కూడా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విభజన సమస్యలపై కేంద్రంపై పోరాడితే తాము మద్దతిస్తామని అన్నారు.
"రాయలసీమ వాసులైతే సీమ భవిష్యత్ కోసం, పిల్లల భవిష్యత్‌పై మీకు ఆలోచన ఉంటే మీరు కూడా మాతో కలిసి రండి. ఈ రాయలసీమ గర్జనకు ఏదైనా రాజకీయ పార్టీ రాలేదంటే వారు రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసిన వారు అవుతారు. రానివారికి అధికారం, ఎన్నికలే ముఖ్యమని ప్రాంతం పైన ఏమాత్రం శ్రద్ధ లేదని భావిస్తున్నాము."- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
ఎవరి పేరు మీద సీమ గర్జన పెడుతున్నారు. అర్థం కావటం లేదు. రాయలసీమలోని విద్యార్థులను ఈ గర్జనకు తరలించాలని చూస్తున్నారు. విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ఏమిటి సంబంధం. హైకోర్టు వద్దని ఏ ప్రతిపక్ష పార్టీ చెప్పదు. ప్రకటించింది, నిర్మిస్తానని చెప్పింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిర్మించే అధికారం ఆయన దగ్గర ఉంది. ఇవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ప్రతిపక్షాలపైన పడితే ఎలా." - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నేత
ఇవీ చదవండి: