కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఈరన్న హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు సంతానం. పెద్ద కుమారుడికి వివాహం కాగా... రెండో కుమారుడు ఉదయ్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఉదయ్‌కు కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలు వస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా తగ్గకపోవటంతో ఏడు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడికి మెదడు క్యాన్సర్( బ్రెయిన్ ట్యూమర్) అని తేలింది. ఇల్లు తాకట్టు పెట్టి నాలుగు లక్షలతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసి తలలోని కణతిని తొలగించారు.
వదలని మహమ్మారి
శస్త్ర చికిత్స అనంతరం బాలుడు సాధారణ స్థితికి రావటంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. రెండు నెలల నుంచి ఉదయ్‌కు గాయం తిరగబడింది. తల భాగంలో కణతి మళ్లీ భారీగా ఏర్పడింది. మందులు వాడుతున్నా తగ్గలేదు.
తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈరన్న. కుమారుడికి చికిత్స కోసం ఇల్లు తాకట్టు పెట్టాడు. ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స చేయించే స్థోమత తనకు లేదని ఈరన్న అంటున్నారు.
మరోసారి ఆపరేషన్ చేయకుంటే నా బిడ్డ ప్రాణాలకే ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు. దానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. నేను చిన్న ఉద్యోగస్థుడిని. కళ్లెదుటే నా కుమారుడు బాధ పడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. వాడి కంటే ముందే నేను చనిపోవాలని అనిపిస్తోంది(కన్నీటితో). ప్రభుత్వం, దాతలు ఆదుకుని నా బిడ్డ ప్రాణాలను నిలబెట్టండి- ఈరన్న, ఉదయ్ తండ్రి
ప్రభుత్వం ఈరన్న కుటుంబాన్ని అదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడికి శస్త్ర చికిత్స చేయించాలని అంటున్నారు.
ఇదీ చదవండి