APNGO Demands: అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కర్నూలులో అన్నారు. ఆయన నగరంలోని ఎస్సీ రిజెన్సీ హోటల్లో పాత్రికేయులతో మాట్లాడుతూ డీఏ బకాయిలు మొత్తం ఒకేసారి ఇస్తున్నట్లుగా చెప్పి గతం కంటే జీతం ఎక్కువగా వచ్చేటట్లు చూపించి డీఏ బకాయిలు ఇవ్వకపోవడం దారుణనున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5 డీఏ బకాయిలు ఇంత వరకు జమకాలేదన్నారు. డీఏ బకాయిలను చెల్లిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన జీవోల కాలపరిమితి గడువు ముగిసిందన్నారు.
జీపీఎస్ డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినట్లు చూపించినప్పటికీ ఖాతాలకు మాత్రం డబ్బులు మాయమయ్యాయన్నారు. సాంకేతిక కారణాల లోపంతో తాము డబ్బు జమ చేయలేదని ఆర్థిక శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వాడుకుందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులే ఒప్పుకున్నారని ఆయన అన్నారు. పదవీ విమరణ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండానే ఆదాయ పన్ను చెల్లించాలని చెప్పడం ఎంత వరకు న్యాయమన్నారు. రెండేళ్లుగా సరెండర్ లీవులు, జీపీఎఫ్ డబ్బులు, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లులు ఏవీ చెల్లింపులు చేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మా డబ్బులు మాకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సహకరించామని.. జనవరి 15 వరకు నిరీక్షిస్తాం అప్పటీకి ప్రభుత్వం స్పందించకుండా సమస్యలు పరిష్కారం చెయ్యకుంటే అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.
ఇవీ చదవండి: