తుంగభద్ర నదిలో..సరైన నిర్వహణ లేక నిత్యం పెద్దఎత్తున మురుగునీరు కలుస్తోంది. కర్నాటకలో పుట్టి ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులో ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లాలో.. కృష్ణానదిలో తుంగభద్ర కలిసిపోతుంది. కర్నూలు నగరంలోని రోజా వీధి, సంకల్ బాగ్, నగరేశ్వరం ఆలయం, సాయిబాబా గుడి, రాఘవేంద్ర మఠం, ఓల్డ్ సిటీల నుంచి రోజూ 60 ఎంఎల్‌డీల మురుగునీరు, వ్యర్థాలు నదీజలాల్లో కలుస్తున్నాయి. నగరం నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి కలుస్తోంది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో నీటి శుద్ధికి మూడు ప్లాంట్లు ఉన్నా.. ఒక్కో కేంద్రం నుంచి 0.80 ఎంఎల్‌డీల చొప్పున మాత్రమే శుద్ధి చేస్తున్నారు. అంటే 2.4 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి అవుతోంది. మిగిలినదంతా.. నదిలో కలిసిపోతోంది. ఈ నీరు కృష్ణా నదిలో కలిసి..శ్రీశైలం,నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా బంగాళాఖాతానికి చేరుతుంది. వందలాది గ్రామాల ప్రజలు తాగు, సాగుకోసం ఈ నీటిని వినియోగిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ప్రవహించే మరో నది కుందూ. నంద్యాల పట్టణం నుంచి ఈ నది ప్రవహిస్తోంది. పట్టణంలోని మురుగునీరంతా ఈ నదిలోనే కలుస్తుంది. మురుగును శుద్ధి చేసేందుకు రెండు ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నిత్యం 2.1 కోట్ల లీటర్ల మురుగునీరు నేరుగా కుందూలో కలుస్తోంది. ఇప్పటికైనా స్పందించి... నదులను కాలుష్యం కోరల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు