శివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలోని పలు శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
శ్రీశైల మల్లన్న క్షేత్రం..
శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. స్వామి, అమ్మవార్లను దర్శించున్నారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల కల్యాణం ఈ రోజు రాత్రి దేవాలయంలో నిర్వహించనున్నారు.
మహానంది ఆలయం..
మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానందీశ్వరుడి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే అక్కడికి చేరుకున్నారు.