రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం ఇసుక డిపోలను జేపీ పవర్స్ సంస్థకు అప్పగించింది. దీంతో కర్నూలు జిల్లాలోని 12 చోట్ల ఉన్న ఇసుక డిపోలన్నీ ఆ సంస్థ పరిధిలోనే నడవనున్నాయి. ఈనెల 14 నుంచి ప్రభుత్వం ఇసుక విక్రయాలను నిలిపివేసింది. కర్నూలు నగరంలో రెండు చోట్ల, నంద్యాల, ఆదోని, పాణ్యం, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచర్ల, బనగానపల్లి ప్రాంతాల్లో ఇసుక డిపోలు నడుస్తున్నాయి. ప్రస్తుతమున్న ఈ డిపోలను అలాగే కొనసాగించాలా? తగ్గించాలా? అనే విషయాన్ని ప్రైవేటు సంస్థ నిర్ణయానికే ప్రభుత్వం వదిలేసింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుక డిపోల ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి. 30 వేల టన్నులకుపైగా నాడు-నేడు పనులకు కేటాయించారు. ఈనెల మొదటి వారం నుంచి జిల్లాలో ఇసుక విక్రయాలు నిలిచిపోగా ప్రస్తుతం విక్రయాలన్నీ ప్రైవేటు సంస్థ ద్వారానే జరగనున్నాయి.
మారిన ధరలతో అవస్థలే..
గతంలో జిల్లాలో ‘ఆన్‌లైన్’ ద్వారా ఇసుక నమోదు చేసుకున్నవారు 50 మంది వరకు ఉన్నారు. వీరికి ఇంత వరకు సరకు అందలేదు. వీరి సంఖ్యను గుర్తించి ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు వారి బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని నమోదు చేయాలని నిర్ణయించారు. వీరంతా ఇసుక కావాలంటే తమ దగ్గరల్లోని డిపోలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిందే. మారిన ధరల ప్రకారం వీరు ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ర్యాంపుల దగ్గర టన్ను ఇసుకకు రూ.475గా ఉండేది. అంతకుముందు ఏడాది రూ.375గా ఉండేది. ఇక ఇసుక డిపోల వద్ద రూ.1500 వరకు విక్రయించేవారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థ తమ ఖర్చులు, ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మరో రూ.100 వరకు అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థకు ఇసుక విక్రయాలను అప్పగించినా.. పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వ అధికారులు చేయనున్నారు. ఎక్కడి నుంచి ఇసుకను తెస్తున్నారు? వినియోగదారులకు అమ్మే ధర, బిల్లులు సక్రమంగా ఇస్తున్నారా? లేదా? అనే విషయాలపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ ఉంటుంది.
ఎక్కడి నుంచైనా తోడుకోవచ్చు
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విక్రయాలన్నీ ఒకే ప్రైవేటు సంస్థకే అప్పగించడంతో ఆ సంస్థ ఇక ఎక్కడి నుంచైనా ఇసుక తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో కౌతాళం మండలం గుడికంబాలి, నందవరం మండలం నాగులదిన్నెలో ఓపెన్ రీచ్‌లు ఉండగా సి.బెళగల్ మండలం కె.శింగవరం, కొత్తకోట, రంగాపురం గ్రామాల్లో పూడికతీత రీచ్‌లు ఉన్నాయి. నాగులదిన్నె ఓపెన్ రీచ్‌లో నీళ్లు ఉండటంతో ఇసుక తవ్వకాలు జరగడం లేదు. జిల్లాలోని రీచ్‌ల నుంచి సగటున రోజుకు 6 వేల టన్నుల వరకు ఇసుకను వెలికి తీసేవారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థకు ఇచ్చిన వెసులుబాటుతో అనంతపురం, కడప జిల్లాల నుంచి కూడా ఇసుకను తెచ్చి జిల్లాలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. అయితే నిల్వలపై ఖనిజాభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు నిఘా ఉంచనుంది.
ఆరు రోజుల నుంచి నిలిపివేశాం
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు ఆరు రోజుల క్రితం నుంచి నిలిపివేశాం. ఇక నుంచి వినియోగదారులు ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో విక్రయించే డిపో ద్వారానే ఇసుకను కొనుగోలు చేయాలి. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారి డబ్బులు వెనక్కి ఇస్తాం. డిపోల్లో నిల్వలు ఏమీ లేవు. - వేణుగోపాల్, మైనింగ్ ఏడీ, బనగానపల్లి
ఇసుక డిపోల్లో ‘నిల్వలు’ నిల్
జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా విభజించి గతంలో 12 డిపోలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డిపోల్లో ఇసుక నిల్వలపై అధికారులు గత రెండు రోజులుగా నివేదికలు తెప్పించుకున్నారు. అధికారులు, సర్వే సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. డిపోల్లో ఎక్కడా కూడా నిల్వలు లేనట్లు గుర్తించారు. అన్ని డిపోల్లో ఇదే రకమైన నివేదికలు అందడంతో ఉన్న డిపోలను జేపీ పవర్స్ సంస్థకు అప్పగించారు. ఇక నుంచి ఇసుక డిపోల్లోని సీసీ కెమెరాలతోపాటు ఇతర పరికరాలన్నీ ప్రైవేటు సంస్థ చేతులోకి వెళ్లనున్నాయి.
ఇదీ చదవండి: తపాలా సేవలు భళా ..