కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పుల గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వితంతువు దారుణ హత్య ఘటన పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన సచివాలయ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
అసలేమైందంటే..
గోనెగండ్ల మండలంలోని బైలుప్పుల లక్ష్మికి తొమ్మిదేళ్ల కిందటే భర్త చనిపోయాడు. అప్పటినుంచి ముగ్గురు కుమార్తెలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. అదే మండలంలోని బి.అగ్రహారానికి చెందిన దేవదాసుతో పరిచయం ఏర్పడింది. ఆమెను తరచూ కలుస్తూ ద్విచక్ర వాహనంపై దేవదాసు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో.. జూన్ 7న లక్ష్మీ ఆదోనిలో వివాహానికి ఇంటి నుంచి బయలుదేరింది. వివాహానికి వెళ్లిన ఆమెను.. అనంతపురం జిల్లా గుంతకల్లు ఉన్న ఓ చర్చికి వెళితే జీవితంలో సంతోషంగా ఉండవచ్చని దేవదాసు నమ్మబలికాడు. తన ద్విచక్రవాహనంపై ఆమెను తీసుకెళ్లాడు.
పగతో హత్య..
అప్పటికే ఆ మహిళపై ప్రత్యేక దృష్టి పెట్టిన దేవదాస్.. క్రమంగా అనుమానం పెంచుకున్నాడు. వేరే వాళ్లతో కూడా చనువుగా ఉంటోందని భావించాడు. గుంతకల్లు సమీపంలోని కసాపురం వద్ద నిర్మానుష ప్రదేశమైన గుట్టల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టాడు. పోలీసులు కాల్ డేటా ఆదారంగా విచారణ చేయగా దేవదాసు హత్య చేసినట్లు తేలింది. కాల్చిన కళేబరాన్ని ఎవరూ గుర్తించకుండా ఆమె ఒంటిపై ఆభరణాలను దేవదాస్ తీసుకెళ్లినట్లు గ్రామీణ సీఐ మంజునాథ్ పేర్కొన్నారు. పోలీసులు దేవదాసును అరెస్టు చేసి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: