కర్నూలు జిల్లాలో రహదారులు దెబ్బతినటంతో వాహనచోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోడ్లలో.. అడుగుకో గుంత కనిపిస్తుంటే, మరికొన్ని రాళ్లు తేలాయి. వర్షం వచ్చిందంటే చాలు.. రహదారులు జలమయం అవుతున్నాయి.
కోడుమూరులో..
ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కోడుమూరు - ఎమ్మిగనూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇందుకు తోడు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గుంతల్లో వర్షం నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ఈ తరుణంలోనే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లోడు లారీ గుంతల్లో కూరుకుపోయింది. దీంతో లారీని బయటకు తీసేందుకు జేసీబీ సాయం తీసుకున్నారు. అయినా.. ఎంత సేపటికీ లారీ బయటికి రాకపోవడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి తలో చేయి వేసి వాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికీ ఫలితం రాలేదు. కోడుమూరులో ఇంతటి సమస్య ఉన్న రహదారుల సమస్యలను నేతలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
మంత్రాలయం..
మంత్రాలయం మండలంలోని సూగూరు, బూదూరు, తిమ్మాపురం, వగరూరు, జాలవాడి, చిలకలఢోన, కల్లుదేవకుంట గ్రామాలను అనుసంధానంగా ఉండే జాలవాడి రహదారి 18 కిలో మీటర్ల మేర దెబ్బతిన్నది. 10 సంవత్సరాలగా ఈ రోడ్లు మరమ్మత్తుకు నోచుకోలేదని స్థానికులు తెలిపారు. కాస్త వర్షం కురిసినా రహదారులపై నీరు చేరటంతో.. ద్విచక్ర వాహనదారులు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని వాపోయారు.
ఆదోని..
అడుగడుగునా ఏర్పడిన గుంతల రహదారుల్లో ప్రయాణమంటేనే బేంబేలేత్తుతున్నారు ఆదోని వాసులు. కొన్ని రహదారులైతే అడుగుకో గుంతతో కనిపిస్తుంటే, మరికొన్ని రాళ్లు తేలాయి. వర్షం కురిస్తే రోడ్లపై నీరు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా శంకర్ నగర్, పంజరపోల్,ఎన్జీఓ కాలనీ,నిజముద్దిన కాలనీ,శివారు కాలనీల దుస్థితి చాలా అద్వనంగా మారాయి. ఆదోని-ఆలూరు రహదారి పూర్తిగా దెబ్బతింది. గుంతల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆదోని నుంచి వెళ్లే పండవగల్లు, కుప్పగల్లు మార్గాలు కంకరతెలి గుంతలు ఏర్పడ్డాయి. ఆదోని నుంచి పర్వతపురం వెళ్లే రోడ్డు కూడా చాలా దెబ్బతిన్నాయి.
ఆళ్లగడ్డ..
ఆళ్లగడ్డ నుంచి కోవెలకుంట్ల కు వెళ్లే రహదారి పలుచోట్ల గోతుల మయంగా మారింది. ముఖ్యంగా దొర్నిపాడు రోడ్డులో అడుగుకు ఒక గుంత కనపడుతుంది. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రం నుంచి మండలాలకు వెళ్లే రహదారిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
డోన్..
డోన్ నుంచి దొరపల్లి, లక్ష్మీపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డు వేసి 2 సంవత్సరాలే అయినప్పటికి.. రహదారులు దెబ్బతిని గుంతలు పడ్డాయి. ఈ దారిలో భారీ వాహనాలు తిరగడం వలన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. డోన్ నుంచి వెంకటనాయుని పల్లికి వెళ్లే రహదారిలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. చిన్న పాటి వర్షానికి రహదారిలో నీరు నిలబడి వాహన రాక పోకలకు ఇబ్బందిగా ఉంది.
నంద్యాల..
రహదారిపై గుంతలు పడితే అంతే. మరమ్మతులు మాత్రం ఉండవు. రోజుల తరబడి సమస్య అట్లే ఉండటంతో ప్రజాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల పద్మావతినగర్‌లో రహదారిపై పడ్డ గుంతలు ఇందుకు నిదర్శనం. అధికారులు పలు మార్లు కంకర వేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో సమస్య మరింత జటిలం అయింది.
ఇదీ చదవండి: