రాష్ట్రంలో పలు జిల్లాలో అక్రమ మద్యం రవాణా, అమ్మకాలు, నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ దారిలో మద్యం తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మాచర్లలో మద్యం సీసాల ద్వంసం
మాచర్లలో సీజ్ చేసిన లిక్కర్‌ను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యాన్ని మాచర్ల డంపింగ్ యార్డ్ సమీపంలో తొక్కించేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్ఈబీ సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 16,200 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు మాచర్ల ఎస్ఈబీ సీఐ కొండారెడ్డి హెచ్చరించారు.
నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం..
అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఉరవకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని బాలాజీ సినిమా థియేటర్ సమీపంలో భీమలింగ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న 180 కర్ణాటక టెట్రా మద్యం ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. కర్ణాటక ప్రాంతంలో మద్యం తక్కువ ధరకు లభించడంతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో ఇలాంటి వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసులు కొందరిపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ రెడ్డి చెప్పారు. దాడుల్లో పట్టుబడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పరిమితికి మించి అమ్మితే చర్యలు..
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అనధికారికంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంకమ్మ చెట్టు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలను తీసుకువెళ్తున్న ఇద్దర్నీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 48 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం సీసాలను అమ్మితే .. అమ్మిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్సై ఫిరోజ్ హెచ్చరించారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ, గుట్కా , ఖైనీ అమ్మకాలు వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మద్యం తరలిస్తుండగా అరెస్ట్..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్ సమీపంలోని దిగువ కాల్వ వద్ద 240 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తుండగా గ్రామీణ సీఐ మంజునాథ్, ఎసై సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితున్ని పట్టుకున్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తనిఖీలు..
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణాల్లో స్టాకుల్లో తేడాలు ఉన్నాయా? ఏ రోజు అమ్మకాలకు సంబంధించిన నగదు ఆ రోజు బ్యాంకుల్లో జమ చేస్తున్నారా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒంగోలు పట్టణంలో ఈ తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతానికి అన్నీ సక్రమంగానే ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
మైలవరంలో ఎస్ఈబీ అధికారుల దాడులు..
కడప జిల్లా మైలవరం మండలంలో ఎస్ఈబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా విక్రయాలు, తయారీ జోరుగా సాగుతున్నాయని సమాచారంతో శనివారం దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని బుచ్చంపల్లి కొండల్లో సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 4 నాటు సారాయి బట్టీలను సైతం పగులు కొట్టినట్లు ఎస్ఈబీ సీఐ నారాయణ యాదవ్ తెలిపారు. మైలవరం, తలమంచిపట్నం పోలీసు సిబ్బంది సహకారంతో ఈ దాడులు నిర్విహించినట్లు సీఐ వెల్లడించారు.
కర్ణాటక నుంచి తీసుకువస్తున్న అక్రమ మద్యం సీజ్..
కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తీసుకొస్తుండగా చీక్లుబైలు చెక్ పోస్ట్ వద్ద మదనపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన శ్రీనివాసులు తన టాటా ఏస్ వాహనంలో టమాటా బాక్సుల మధ్యలో 25 బాక్సులు టెట్రా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. విలువ వాహనం తో పాటు మూడు లక్షలు ఉంటుందని సి ఐ సునీత తెలిపారు. మద్యంతో పాటు నిందితుడు శ్రీనివాసులును అరెస్టు చేసినట్లు మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సునీత తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.2 లక్షలు ఉంటుదని సీఐ పేర్కొన్నారు.
ఆర్లిలో వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం..
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఆర్లి గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో నిర్వహిస్తున్న నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. నాటుసారా తయారీకి ఉపయోగించే వెయ్యి లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేసినా.. విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని . చెందినట్లు ఎస్సై నారాయణరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: