కర్నూలులో పందులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో, రహదారులపై.. చెత్తకుప్పల వద్ద తుంగభద్ర, హంద్రీ, వక్కెర వాగు తీరాల్లో.. సర్వజన వైద్యశాల ఆవరణలో.. ఫంక్షన్ హాళ్ల వద్ద అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడ చూసినా పందులు దర్శనమిస్తున్నాయి. గతంలో పెద్దాసుపత్రిలో పసిపిల్లలను నోటకరుచుకుని వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. దీంతో పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అయినా పరిష్కారం లభించలేదు.
మూడేళ్ల క్రితం నాటి నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి ప్రతి పందికి లైసెన్స్ తీసుకోవాలని, టోకెన్ వేయాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. పందుల కదలికలపై నిఘా ఉంచేందుకు చిప్ అమర్చాలని నిర్ణయించినప్పటికీ ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదు. దీంతో హైకోర్టు సైతం స్పందించి నగరంలో పందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మరోసారి జోక్యం చేసుకున్న హైకోర్టు.. కనిపిస్తే కాల్చేేయాలని ఆదేశాలు జారీ చేసింది. నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోగా.. పందుల సమస్య మరింత తీవ్రమైంది.
నవంబర్ 20 నుంచి కర్నూలు జిల్లాలో ప్రవహించే తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్నాయి. దీనికోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పుష్కర ఘాట్లు, రహదారుల నిర్మాణాలు చేపట్టారు. వేలాదిమంది ప్రజలు పుణ్య స్నానాల కోసం కర్నూలుకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పందుల వల్ల నగరానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. దీంతో పందులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
2017 గణాంకాల ప్రకారం నగరంలో సుమారు 30 వేల వరకు పందులు ఉంటాయని అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు వీటి సంఖ్య 50 వేలకు పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. వీటిని రెండు వారాల గడువులోగా తరలించాలని.. లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో కొందరు యజమానులు పందులను తరలించే పనిలో పడ్డారు. అయినప్పటికీ పందులే ఉపాధిగా జీవిస్తున్నామని తాము.. జీవనోపాధి కోల్పోతామని యజమానులు చెబుతున్నారు.
పందుల సమస్య పరిష్కారానికి గతంలో అధికారులు నగర శివారులోని డంప్ యార్డు వద్ద 5 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడే షెల్టర్లు వేసుకుని పందులు పెంచుకోవాలని కోరినా.. ఎవరూ పట్టించుకోలేదు. పుష్కరాల పుణ్యమా అని ఇప్పటికైనా పందుల సమస్య పరిష్కారం కావాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...