కర్నూలు నగర ప్రజలు ఎన్నడూ లేనివిధంగా తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా... నగరాన్ని ఆనుకుని ఉన్న తుంగభద్ర ఎండిపోయింది. ఈ నదిపై నిర్మించిన సుంకేశుల జలాశయం నెలరోజుల క్రితమే అడుగంటగా... గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె జలాశయం నుంచి నగరానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులోనూ నిల్వలు తగ్గిపోయి ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీటిని తీసుకుంటున్నారు. మరో 15 రోజులకు మాత్రమే ఈ నీరు సరిపోయేలా ఉంది. నగరానికి ప్రతిరోజూ 85 ఎం.ఎల్.డీల నీరు అవసరం కాగా... ప్రస్తుతం రెండు రోజులకోసారి 50 ఎం.ఎల్.డీల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు మంచి నీరు వారానికోసారి రావటమూ కష్టమైపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడితేనే....
నగరానికి తాగునీటి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిసినా... అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మునగాలపాడు సమీపంలో 0.155 టీఎంసీల సామర్థ్యంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఉంది. ఇందులోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. మరో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చలేదు. వర్షాలు కురిసే వరకు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవటం మినహా చేసేదేం లేదని అధికారులు చెబుతున్నారు. తాగునీటి సమస్య ఎదురవుతుందని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. గత ప్రభుత్వం అలసత్వం కారణంగానే నీటి ఎద్దడి నెలకొందని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని నగరపాలక సంస్థ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే... నీటిని ట్యాంకర్లతో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.