Onion Price Hike: కిందటి నెల వరకు టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపించగా.. ఇప్పుడు ఉల్లి కొండెక్కి కూర్చుంది. ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తుంది. కిందటి వారం వరకు వందకు 3 లేదా 4 కిలోలు వచ్చిన ఉల్లిగడ్డ ఇప్పుడు కేజీ 80 రూపాయలు పలుకుతోంది. ఉల్లిని అధికంగా పండించే కర్నూలు జిల్లాలోనూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రేట్లు దాదాపు రెట్టింపు కావడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి.
తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లిని సాగు చేస్తారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలు పడిపోవడంతో.. ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఉత్పత్తులు రావటం లేదు. కర్నూలు ఉల్లి మార్కెట్‌కు కనీసం 2 వేల క్వింటాళ్లు కూడా రావట్లేదంటే పరిస్థితికి అద్దం పడుతోంది. సరాసరిన క్వింటా 4 వేల 5 వందల వరకు పలుకుతోంది. నాణ్యమైన ఉల్లి క్వింటా ధర 5 వేల పైమాటే.
Onion Price Hike : ఉల్లి ధరకు రెక్కలు.. తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందంటే?
మార్కెట్లో.. కిలో ఉల్లి 55 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటం, భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండటంతో.. ఉల్లి సాగు మరింత తగ్గిపోతోంది. ఫలితంగా.. ఉత్పత్తులు తగ్గిపోయి.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరకులు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పుడు ప్రతీ కూరలో ఉపయోగించే ఉల్లిగడ్డ ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కర్నూలు రైతు బజార్లలో కిలో ఉల్లి 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో.. నాణ్యమైన ఉల్లిని 80 నుంచి వంద రూపాయల వరకు అమ్ముతున్నారు. రెండ్రోజుల్లోనే ధరలు మూడింతలు పెరగటంతో.. సాధారణ ప్రజలు లబోదిబోమంటున్నారు.
ఆకాశాన్ని తాకిన ఉల్లి ధర.. కేజీ రూ.1200.. వాసన చూసి బతికేస్తున్న ప్రజలు!
ఇలా అయితే ఉల్లిని కొనలేం అంటూ చాలా మంది వెనుదిరుగుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొందరు ముందుగానే ఎక్కువ కొనుక్కుని దాచుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుని.. రైతు బజార్లలో రాయితీపై ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
"నిన్న మొన్నటి వరకూ 25 నుంచి 35 వరకూ ఉల్లి ధర ఉండేవి. ఈ రోజు చూస్తే.. 75 నుంచి 85 వరకూ చెప్తున్నారు. ఒకేసారి ఇంత పెరిగితే కొనే పరిస్థితి కూడా లేదు. డబుల్ అయ్యింది. సామాన్య ప్రజలు కొనే పరిస్థితి కనిపించడం లేదు". - స్థానికుడు, కర్నూలు
"ఉల్లి కిలో 80 అంటున్నారు. దీంతో కొనాలంటేనే ఆలోచిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం 40 వరకూ ఉండేది. సమాన్య ప్రజలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. మరింత పెరుగుతుంది ఏమో అని భయంగా ఉంది. రేట్లు భారీగా పెరిగాయి". - స్థానికుడు, కర్నూలు