కర్నూలు జిల్లాలో కరోనా సమయంలో రోగులకు సేవలందించేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టారు. అర్హతలున్న వారిని నియమించుకుని ఆరు నెలలపాటు కరోనా సేవలందించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు జరిగింది. 220 ఎంబీబీఎస్ వైద్యులలో దంత, యునానీ, ఆయుర్వేద వైద్యులను తీసుకున్నారు. ఇందులో 15 మంది వైద్య నిపుణులకు చోటిచ్చారు. అలాగే స్టాఫ్ నర్సులు 257, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు 129, శిక్షణ విద్యార్థులనను 200 మందిని నిబంధనల ప్రకారం అర్హతల ఆధారంగా తీసుకున్నారు.
ఎంబీబీఎస్ వైద్యులకు నెలకు రూ.70వేలు, వైద్య నిపుణులకు రూ.1.50లక్షల వరకు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.28వేలు, ట్రైనీ నర్సులకు రూ.10వేలు చొప్పున జీతం ప్రకటించారు. ఆరు నెలల బాధ్యత కాలంలో ఇప్పటికే మూడు నెలలు గడిచాయి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం చెల్లించ లేదు. సరాసరిన రూ.8కోట్లపైగా చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. విధులు నిర్విహించడానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు కొందరు లాడ్జిల్లో, అద్దెకు గదులు తీసుకుని ఉన్నారు. మూడు నెలలుగా అద్దెలు కట్టక, నిత్యావసరలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు.
తాత్కాలిక వైద్య సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి జిల్లా వైద్యాధికారులు రూ.6కోట్లకు ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్థాయిలో నిధులు ఇంకా విడుదల కాలేదని వైద్యకళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం సిబ్బంది జీతాలపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వివరాలు కోరాగా.. వైద్యఆరోగ్యశాఖ సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల చొరవతో వెంటనే నిధులు విడుదలైతే తమ కష్టాలు తీరతాయని తాత్కాలిక వైద్య సిబ్బంది చెబుతున్నారు.
ఇదీ చదవండి: