రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది పుణ్యక్షేత్రానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. నంద్యాల నుంచి ఒకటి, గాజులపల్లె వైపు నుంచి మరొకటి ఉంది. వానాకాలం వస్తే చాలు... రెండు మార్గాల్లోనూ వర్షపునీరు పొంగి ప్రవహిస్తుంది. నంద్యాల వైపు నుంచి వచ్చే మార్గంలో రాళ్లవాగు, బుక్కాపురం అలుగులు పొంగి పొర్లుతుంటాయి. గాజులపల్లి నుంచి వచ్చే మార్గంలో పాలేరు వాగు ఉప్పొంగుతుంది. నంద్యాల నుంచి వచ్చే మార్గంలో త్వరగానే వరద తగ్గుముఖం పట్టినా... పాలేరు వాగు తీవ్ర సమస్యగా మారుతోంది.
నల్లమల అటవీ ప్రాంతంలో తరచుగా వర్షాలు కురుస్తుంటాయి. మహానంది క్షేత్రాన్ని ఆనుకునే నల్లమల ఉండటంతో.. చిన్నపాటి వర్షం కురిసినా పాలేరు వాగు పొంగుతుంది. దీనివల్ల గాజులపల్లి నుంచి మహానంది రావటం కష్టమవుతోంది. మహానందికి కొంత దూరంలోనే ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధనా స్థానం, పశుపరిశోధనా స్థానం ఉన్నాయి. ప్రకాశం జిల్లా వైపు వెళ్లేందుకు, గాజులపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు ఎంతోమంది ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతాయి.
గాజులపల్లె నుంచి మహానందికి రహదారిని, పాలేరు వాగుపై వంతెన నిర్మించాలని ప్రజలు ఎప్పట్నుంటో అధికారులను కోరుతున్నారు. 2013లో రహదారి నిర్మాణానికి 7 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. గాజులపల్లె నుంచి వ్యవసాయ కళాశాల వరకు పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి పనులు ముందుకు కదల్లేదు. మహానంది వెళ్లే దారిలో రహదారి, వంతెన పూర్తి కాలేదు. ఇప్పటికైనా మిగిలిన పనులు పూర్తిచేసి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి..