లక్షకు మూడు లక్షలు ఇస్తామంటూ ఓ సంస్థ ప్రజలను మోసం చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. అహోబిలం గ్రామ కేంద్రంగా ఈ మోసం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బెటర్ వే సొల్యూషన్' పేరుతో ఒక సంస్థ ప్రజలను దారుణంగా మోసం చేసింది. ఆళ్లగడ్డ, అహోబిలం గ్రామాలకు చెందిన కొందరు ఈ సంస్థకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. లక్ష రూపాయలు కడితే రోజుకు రూ. 5 వేల చొప్పున 60 రోజులపాటు సంస్థ చెల్లిస్తుందని.. దీంతో రూ.3 లక్షలు వస్తాయని చెప్పి ప్రజలను అందులో చేర్పించారు. నగదును సంస్థ ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేయించారు. కొన్నిరోజులపాటు సంస్థ రోజుకు రూ. 5వేలు చొప్పున జనాలకు బాగానే డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.
ముందు చెల్లించిన వారికి డబ్బులు బాగానే వస్తుండటంతో మరికొందరు బెటర్ వే సంస్థకు లక్ష రూపాయలు కట్టారు. ఇలా మొత్తం సంస్థ ఖాతాలో రూ. 3 కోట్లు జమయ్యాయి. ఇక అంతే ఆ తర్వాత నుంచి ప్రజలకు డబ్బులు చెల్లించడం మానేశారు. సంస్థ సర్వర్ కూడా పని చేయలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన జనం పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 4 వందల మంది మోసపోయినట్లు తెలుస్తోంది. సీఐ సుదర్శనప్రసాద్ అహోబిలం చేరుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కరోనా