కర్నూలు జిల్లాలో మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పలుచోట్ల అభ్యర్థులు, మద్దుతుదారులు రోడెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. పగిడ్యాల మండలం... ప్రాతకోట సర్పంచ్ ఫలితం లాఠీఛార్జ్‌కు దారితీసింది. ప్రాతకోటలో 7 ఓట్ల మెజార్టీతో శేషమ్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించగా ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. కౌంటింగ్ అధికారులు ససేమిరా అనడంతో ఓడిన అభ్యర్థి వర్గం పగిడ్యాల వెళ్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. 144సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నా విరమించాలని పోలీసులు కోరారు. ఐనా వారు శాంతించలేదు. ఈ క్రమంలో పోలీసుల లాఠీఛార్జి నుంచి తప్పించుకోబోయి సుధాకర్ అనే వ్యక్తి... కింద పడి చనిపోయినట్లు వైకాపా నాయకులు తెలిపారు. లాఠీఛార్జ్ చేసిన పోలీస్‌లపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సుధాకర్ మృతదేహంతోబైఠాయించారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో పరాజితులు దాడులకు దిగారు. కొచ్చెరువు కౌంటింగ్ కేంద్రంలో ఓడిన అభ్యర్థి ఫ్యాన్‌లు, ట్యూబులైట్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం.... అధికారులను భయాందోళనకు గురిచేసింది.
డోన్ మండలం ఆవులదొడ్డిలో ఓడిన అభ్యర్థి మద్దతుదారులు రీకౌంటింగ్ చేయాలంటూ కౌంటింగ్ కేంద్రంపై రాళ్ల దాడి చేశారు. డోన్ మండలం తిరునాంపల్లి సర్పంచ్‌గా గెలిచిన తేజమణి ఇంటిపై ఓడిన అభ్యర్థి వర్గం దాడి చేసింది. ఇక ప్యాపిలి మండలం చండ్రపల్లిహైడ్రామా నడిచింది. సరోజమ్మ 70 ఓట్ల తేడాతో గెలిచినా అధికారిక ప్రకటనలో జాప్యం చేశారంటూ.... ఆమె మద్దతుదారులు రోడ్డెక్కారు. ఓడినట్లు ఒప్పుకోవాలంటూ పోలీసులు కూడా ఒత్తిడి తెచ్చారని, సరోజమ్మ బంధువులను..గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు..
జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలో 3 ఓట్ల మెజారిటీతో మాధవి గెలుపొందగా .. రీ కౌంటింగ్ పెట్టాలంటూ ఓడిన అభ్యర్థి లింగమ్మ వర్గీయులు ఆందోళన చేశారు. ఈక్రమంలో ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇక పత్తికొండ మండలం మండగిరిలో.. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రీ కౌంటింగ్ చేయాలంటూ... ఎన్నికల సిబ్బందిని అడ్డగించారు.
ఇదీచదవండి.