కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 11వ తేదీన పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మరుసటి రోజు ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. శరీరం నుంచి తల వేరుగా ఉన్నట్లు గుర్తించారు. నిమ్మకాయలు పూజ సామాగ్రి కనిపించడం వలన.... గుప్తనిధుల కోసం వ్యక్తిని బలి ఇచ్చి ఉంటారన్నకోణంలో విచారణ ప్రారంభించారు.
ఈ నెల 5వ తేదీన ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన జాకీర్ భాష అనే యువకుడు ఇంటి నుంచి అదృశ్యమైనట్లు ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యం అయినప్పుడు జాకీర్ భాష ధరించిన దుస్తులు పచ్చర్ల అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహంపై ఉన్న దుస్తులు ఒకటిగా నిర్థారించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
జాకీర్ భాష మొదటినుంచి నిధుల వేటలో ఉన్నాడని... ఇతడికి రాములు, నాగ ప్రసాదు, నాగేంద్ర, శ్రీనివాసులు, గోపాల్ సాయపడేవారని సిరివెళ్ల ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. గుప్త నిధుల కోసం మిగిలిన ఐదుగురు కలిసి జాకీర్ భాషను హత్య చేశారని గుర్తించామన్నారు. నిందితులను వృద్ధవరం మండలం చిన్న కమ్మలూరు మెట్ట వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారు. హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి : బైకు, ట్రాక్టరు ఢీ.. అంగన్వాడీ కార్యకర్తకు గాయాలు