కర్నూలు నగర పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన బాలికపై అత్యాచారం, హత్యకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు హోంశాఖకు పోలీసుశాఖ సిఫారసు చేసినట్లు ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాట్లాడారు. 2017లో నమోదైన ఈ కేసుపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశామన్నారు. కేసు ట్రయల్‌లో ఉండగా బాలిక తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీని కలిసి కేసును తిరిగి దర్యాప్తు చేయించాలని కోరారని గుర్తుచేశారు.
ఈ మేరకు వారు స్పందించి కోర్టు అనుమతి తీసుకొని కేసు పునఃదర్యాప్తు జరిపించేందుకు అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సిట్ (ప్రత్యేక దర్యాప్తు)ను ఏర్పాటు చేశారన్నారు. అదనపు ఎస్పీతోపాటు ఓ మహిళా డీఎస్పీ, ఓ మహిళా సీఐ, సిబ్బంది సిట్‌లో ఉన్నారని వివరించారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మళ్లీ బాధితురాలి తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేసిన కారణంగా హోంమంత్రి, డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖకు సిఫారసు చేస్తూ డీజీపీ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. కేసుకు సంబంధించి అన్ని దస్త్రాలు డీజీపీకి పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విచారణ రేపటికి వాయిదా