జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా.. సాఫీగా జరిగాయని, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పతో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. తొలి దశలో 141 పంచాయతీల్లో జరిగిన పోలింగ్‌లో 2,63,934 (82.14 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం కృషి చేయడం వల్లే ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఓటింగ్ జరిగిందని అభినందించారు. ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని కోరారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఫ్యాక్షన్ గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఎటువంటి సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు