Kurnool Typist Qasim Saheb Fake Receipts case updates: ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం.. కర్నూలు జిల్లా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టైపిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి కేసు విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. ఏ ఆరోపణలతో శాఖాపరమైన విచారణ జరిపి, ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించారో.. అదే ఆరోపణలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసినప్పుడు ఆ ఉద్యోగిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాదు, న్యాయస్థానం అతడిని నిర్దోషిగా విడుదల చేసినప్పుడు.. అదే ఆరోపణలపై సర్వీసు నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని కూడా స్పష్టతనిచ్చింది. మరీ ఎవరా ఉద్యోగి..?,ఆ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు ఏమిటి..? ఎందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు..? అనే వివరాలను తెలుసుకుందామా..
టైపిస్ట్ ఖాసిం సాహెబ్‌పై సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డి.ఖాసిం సాహెబ్ అనే ఉద్యోగి టైపిస్ట్‌గా విధులు నిర్వర్తించేవారు. ఇతర ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేసి.. డూప్లికేట్ రసీదుల సృష్టించి.. సుమారు రూ.69 వేల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో 1988లో స్థానిక పోలీసు స్టేషన్‌లో సాహెబ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత సాహెబ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు శాఖాపరమైన విచారణలో తేలింది. దీంతో అతడిని 1995లో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, సాహెబ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసును నందికొట్కూరు జూనియర్ ఫస్ట్ క్లాజ్ మేజిస్ట్రేట్ కోర్టు 1997లో కొట్టివేసింది. వెంటనే పోలీసులు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలాలు చేశారు. పిటిషన్‌పై ధర్మాసనం దానిని 1998లో కొట్టేవేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగ నుంచి తొలగింపు.. ఈ నేపథ్యంలో ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. మార్కెట్ కమిటీ పర్సన్ ఇన్‌చార్జి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఖాసిం సాహెబ్ 2001లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో పిటిషన్ వేశారు. దీంతో ఖాసిం సాహెబ్ రెండున్నరేళ్లు జాప్యం చేశారని అతడి (ఖాసిం) పిటిషన్‌ను 2003లో పరిపాలన ట్రిబ్యునల్ కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ 2003లో ఖాసిం సాహెబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలాలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పును వెలువరించింది.
ఆ జీతభత్యాలకు అర్హుడు కాదు.. తీర్పులో భాగంగా తనను (డి.ఖాసిం సాహెబ్) సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ సాహెబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అనంతరం సాహెబ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే, సర్వీసులోని తొలగించిన తేదీ నుంచి నిర్దోషిగా తేలిన తేదీ వరకు నో వర్క్, నో పే సూత్రం ఆధారంగా ఎలాంటి జీతభత్యాలకు అర్హుడు కాదని పేర్కొంది. నిర్దోషిగా తేలిన నాటి నుంచి సర్వీసులో చేరేంత వరకు అన్ని ప్రయోజనాలకు అర్హుడని వెల్లడించింది. దీంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన డి.ఖాసిం సాహెబ్.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరబోతున్నట్లు సమచారం.
ఇవీ చదవండి